
వార్ వన్ సైడే?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) విజయకేతనం ఎగురవేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా
- సర్వేలు, ఎగ్జిట్‌పోల్ అంచనాల్లో వెల్లడి
- సగానికిపైగా డివిజన్లలో గెలుపు గులాబీ పార్టీదే!
- సీఎం కేసీఆర్‌పై మధ్యతరగతి, పేదల్లో విశ్వాసం
- ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న చోట కూడా కారు జోరు
- ‘గ్రేటర్’ మేయర్ పీఠం అధికార పార్టీకే
- ప్రతిపక్ష హోదాకే పరిమితంకానున్న మజ్లిస్
- మూడో స్థానంలో టీడీపీ-బీజేపీ కూటమి దారుణంగా కాంగ్రెస్ పరిస్థితి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) విజయకేతనం ఎగురవేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో సగానికంటే ఎక్కువగా ఆ పార్టీయే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరే పార్టీతో పొత్తు అవసరం లేకుండానే... టీఆర్‌ఎస్ సొంతంగా మేయర్ పీఠాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టిస్తుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న హామీతో మధ్యతరగతిని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్న వాగ్దానంతో పేదవర్గాల మద్దతును టీఆర్‌ఎస్ పూర్తిగా కూడగట్టుకున్నట్లు పోలింగ్ సరళిని చూస్తే అవగతమవుతోంది.
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితం జీహెచ్‌ఎంసీలో పునరావృతమవుతుందని రాజకీయ పరిశీలకులు, సర్వేలు చేసిన విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఓటు వేయడానికి వచ్చిన ప్రతి పది మందిలో ఏడుగురు టీఆర్‌ఎస్‌కు వేశారు. కొద్దిచోట్ల మాత్రమే టీఆర్‌ఎస్‌తో టీడీపీ-బీజేపీ కూటమి పోటీ పడ్డాయి..’’ అని ఎగ్జిట్‌పోల్ నిర్వహించిన ఎస్‌ఎంఎఫ్‌ఎస్ సంస్థ ప్రతినిధి నాగన్న చెప్పారు. ఇప్పటిదాకా జీహెచ్‌ఎంసీలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చిన ‘మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)’ ఈసారి ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది.
2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-మజ్లిస్ అవగాహనకు వచ్చి పదవీకాలాన్ని చెరిసగం పంచుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఏ పార్టీతో పొత్తు అవసరం లేకుండానే టీఆర్‌ఎస్ ఐదేళ్ల పాటు జీహెచ్‌ఎంసీని పాలిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే మెజారిటీ సంఖ్యలో ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దాదాపు 74 లక్షల మంది ఓటర్లున్న జీహెచ్‌ఎంసీలో 45 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం ఓట్లు ఎక్కువగా పోలైనట్లు అధికారులు చెబుతున్నారు. అటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విసృ్తతంగా ప్రచారం నిర్వహించినా ఓటింగ్ శాతంలో పెద్దగా తేడా లేదు.
మూడో స్థానంలో టీడీపీ-బీజేపీ కూటమి
తెలుగుదేశం- బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కానుంది. ఈ కూటమి 20-25 డివిజన్లు గెలుచుకునే అవకాశముందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. ఆ కూటమి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు తన ప్రచారంలో ఎక్కడా తెలంగాణ సీఎంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా సుతిమెత్తని ఆరోపణలకే పరిమితమయ్యారు.
ఇది టీడీపీ నేతలు, శ్రేణుల్లో ఆందోళనకు కారణమైంది. ‘మా పార్టీకి సరైన ఫలితాలు రాకపోతే దానికి బాధ్యుడు అధినేత చంద్రబాబే..’ అని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. గ్రేటర్ ఫలితాల తరువాత మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గత్యంతరం లేని స్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగిన బీజేపీ పరిస్థితి కూడా బాగోలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది.
దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి
కాంగ్రెస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతాయని తెలిసినా టీపీసీసీ నాయకత్వం దానికి తగ్గట్లుగా సంసిద్ధం కాకపోవడం, కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని నింపలేకపోవడం దెబ్బతీసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి ఆపార్టీ ఎమ్మెల్యేలెవరూ రాలేదు. తాము బాధ్యత తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన సీనియర్లు కూడా ప్రచారం దరిదాపుల్లోకి వెళ్లలేదు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పాల్గొన్న సభల్లో మాత్రమే కాంగ్రెస్ సీనియర్ నేతలు కనిపించారు. దానికితోడు కొందరు మాజీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలూ వచ్చాయి. గత ఎన్నికల్లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన ఓ టీఆర్‌ఎస్ నేత భార్యను ఓడించడానికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు తమ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని రంగంలోకి దింపడంతోపాటు టీడీపీ అభ్యర్థి విజయం కోసం రూ.కోటి ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పాత మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ హవా
గ్రేటర్‌లో విలీనానికి ముందున్న పాత మున్సిపాలిటీలు సహా నగరంలోని అనేక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో టీఆర్‌ఎస్ 8 స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. మిగతా మూడింటిలో రెండు టీడీపీ, ఒకదానిని కాంగ్రెస్ సాధించే పరిస్థితి ఉంది. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి ఒక్క సీటు కూడా దక్కే సూచనలు లేవు.
ఇక్కడి 11 డివిజన్లలో పదింటిని టీఆర్‌ఎస్, ఒకదాన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశముంది. టీడీపీ ప్రాతినిధ్యం ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ నియోజకవర్గంలోని 9 డివిజన్లలో టీఆర్‌ఎస్ 7 చోట్ల, టీడీపీ 2 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరిలోని 9 స్థానాల్లో 8 చోట్ల టీఆర్‌ఎస్, ఒకదానిలో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి కనిపించింది.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ నియోజకవర్గం సనత్‌నగర్ పరిధిలోని అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ ప్రత్యర్థుల కంటే టీఆర్‌ఎస్ ముందంజలో ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.