నిషాకూ కల్తీ!
మద్యం బాటిళ్లలో నీళ్లు కలుపుతున్న డిస్టిలరీలు, వ్యాపారులు
- మొలాసిస్ ధర పెరగడంతో డిస్టిలరీలపై వ్యయ భారం
- భారం తగ్గించుకునేందుకు ఆల్కహాల్ శాతాన్ని తగ్గిస్తున్న వైనం
పెగ్గు మీద పెగ్గు కొడితే.. నిషా నింగినంటాలె.. చుక్కలు నేలకు దిగి రావాలె.. కానీ ఒకటి.. రెండు.. మూడు.. నాలుగో పెగ్గు వేసినా ‘కిక్కు’ ఎక్కడం లేదు.. తాగీ తాగీ నాలుక మందమైందా లేక ‘మందు’కు శరీరం పూర్తిగా అలవాటు పడిపోయిందా తెలియక మందు బాబులు జుట్టు పీక్కుంటున్నారు.. కానీ అసలు కారణం మాత్రం మందు ‘పలుచబడి’పోవడమే! ఇటు డిస్టిలరీలు మద్యంలో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి నీళ్లు కలుపుతుండటం... అటు మద్యం వ్యాపారులు బాటిళ్ల నుంచి మద్యం తీసి నీళ్లు కలిపేస్తుండటంతో మందు బాబులకు ‘కిక్కు’ ఎక్కడం లేదు. వ్యాపారులు మీడియం, ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిళ్ల మూతల నుంచి సిరంజి గుచ్చి మద్యాన్ని లాగేస్తున్నారు.. ఆ మేరకు నీటితో, చీప్ లిక్కర్‌తో నింపేస్తున్నారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ పర్యవేక్షణ కొరవడటం, నిఘా తగ్గిపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.
మొలాసిస్ దొరకడం లేదని..
డబ్బు మిగిలించుకోవడం కోసం డిస్టిలరీలు మద్యంలో ఆల్కహాల్ శాతం తగ్గించి నీటి శాతం పెంచుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలు లేకపోవటంతో చెరుకు నుంచి ఉత్పత్తయ్యే మొలాసిస్ కొరత ఉంది. దాంతో మద్యం ఉత్పత్తికి డిస్టిలరీలు గ్రెయిన్ మొలాసిస్ వాడుతున్నాయి. చెరుకు మొలాసిస్ ఈఎన్‌ఏ లీటర్‌కు మార్కెట్‌లో ధర రూ.35 ఉండగా... గ్రెయిన్ మొలాసిస్ ఈఎన్‌ఏ లీటర్‌కు రూ.45 నుంచి రూ.48 వరకు ఉంది. గ్రెయిన్ మొలాసిస్ నుంచి మద్యం నాణ్యంగా ఉత్పత్తికాదు. దాంతో వివిధ రకాల ఫ్లేవర్లు, రసాయనాలు కలిపి మద్యాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తారు. ఇదంతా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
ఇలా పెరిగిన ఖర్చును సర్దుబాటు చేసుకునేందుకు డిస్టిలరీల యాజమాన్యాలు మద్యంలో నీటి శాతం పెంచుతున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. లిక్కర్ తయారీలో ఈఎన్‌ఏ(ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్) వాడతా రు. నిబంధనల ప్రకారం ఇది 42.8 శాతం, మిగతా శాతం నీళ్లుండాలి. కానీ డిస్టిలరీలు నీటిని పెంచి, ఈఎన్‌ఏను తగ్గిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని డిస్టిలరీలు రోజుకు 10వేల కేసులకుపైగా మద్యం ఉత్పత్తి చేయగలవు. అందులో ఒక శాతం నీళ్లు కలిపినా 5,000 లీటర్ల ఈఎన్‌ఏ మిగులుతుంది. దీంతో అదనంగా 550 కేసుల మద్యం ఉత్పత్తి అవుతుంది. తద్వారా రూ.3.20 లక్షల అదనపు ఆదాయం సమకూరుతుంది.
చాలా ఏళ్ల నుంచి దందా..
వ్యాపారులు మద్యంలో నీళ్లు కలుపుతూ సొమ్ము దండుకుంటున్న దందా చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. డిస్టిలరీలు, వ్యాపారులు మద్యంలో నీళ్లు కలిపి విక్రయించడంపై నాలుగేళ్ల కింద పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దానిపై పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దాంతో అప్పటి సికింద్రాబాద్ ఎక్సైజ్ సీఐ అంజిరెడ్డి (ప్రస్తుతం ఏఈఎస్) తన పరిధిలోని మద్యం దుకాణాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. దాంతో ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్ర్రోకాట్, అశోక విస్కీ బ్రాండ్లలో కల్తీ జరిగినట్లు తేలింది. ఈ మూడు బ్రాండ్లు కూడా హైదరాబాద్ శివార్లలోని ఒకే డిస్టిలరీ సంస్థ నుంచి ఉత్పత్తి అయినట్లు గుర్తించి, నోటీసులు కూడా జారీ చేశారు. అంతకు ముందు సీగ్రామ్ బ్రాండ్లలోనూ నీళ్ల శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
సిరంజి వేసి.. మద్యం గుంజి..
ఇక నెల రోజుల్లో మద్యం దుకాణాల లీజు సమయం ముగుస్తుండటంతో వ్యాపారులు అడ్డగోలు వ్యవహారానికి తెరలేపారు. బాటిళ్ల నుంచి మద్యం తీసి.. నీళ్లు కలిపేసి అమ్ముతున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో బిజీగా ఉండి.. పర్యవేక్షణను వదిలేయడం కూడా వారికి కలసి వచ్చింది. ముఖ్యంగా ప్రీమియం, మధ్యస్థాయి ధర ఉన్న బ్రాండ్ల ఫుల్ బాటిళ్ల నుంచి మద్యాన్ని తీసి.. అంతే మోతాదులో నీళ్లు కలుపుతున్నారు.
వాటి మూతల ద్వారా సిరంజిలు గుచ్చి.. ఒక్కో బాటిల్ నుంచి 90 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల దాకా లాగేస్తున్నారు. ఈ మద్యాన్ని ఖాళీ క్వార్టర్ బాటిళ్లలో నింపి సీలు వేసి విక్రయిస్తున్నారు. పలు చోట్ల విడిగా గ్లాసుల్లో పోసి అమ్ముతున్నారు. కొందరు వ్యాపారులు ప్రీమియం బ్రాండ్ల బాటిళ్ల నుంచి మద్యాన్ని తీశాక.. ఆ స్థానంలో చీప్‌లిక్కర్‌ను నింపుతున్నారు. ఒకప్పుడు బార్లకే పరిమితమైన ఈ దందా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా దుకాణాలకు పాకింది. ఈ నీళ్లు కలిపే వ్యవహారమంతా రాత్రికి రాత్రే సాగుతోంది. మద్యం దుకాణం మూసేశాక.. లోపల కొందరు పనివాళ్లను ఉంచి ఉదయం దాకా కల్తీ పని కానిచ్చేస్తున్నారు.