మద్యం షాపులకు క్యూ.. | Alcohol shops in the queue .. | Sakshi
Sakshi News home page

మద్యం షాపులకు క్యూ..

Published Sun, Jun 22 2014 5:14 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Alcohol shops in the queue ..

  •     దరఖాస్తుల వెల్లువ
  •      చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు
  •      రంగంలోకి లిక్కర్ డాన్‌లు..బినామీలతో అప్లికేషన్లు
  •       సగానికి పైగా షాపులను దక్కించుకునే యత్నం
  •      214 దుకాణాలకు 2015కు పైగా దరఖాస్తులు
  •      20 షాపులకు నిల్
  •      రేపు లాటరీ పద్ధతిలో కేటాయింపు
  • వరంగల్ క్రైం : జిల్లాలో మద్యం దుకాణాలకు మందకొడిగా ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ చివరి రోజు శనివారం ఊపందుకుంది. హన్మకొండ హౌసింగ్‌బోర్డులోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం వ్యాపారులు బారులుదీరారు. జిల్లాలోని 234 మద్యం దుకాణాలకు మూడు రోజుల్లో 1,015 దరఖాస్తులు రాగా... చివరి రోజు వెయ్యికి పైగా ఆర్జీలు వచ్చాయి. క్యూలో నిల్చున్న వారికి రాత్రి 10 గంటలకు వరకు కూడా దరఖాస్తు చేసుకునేం దుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది.

    జిల్లాలో మొత్తం 234 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. చివరి రోజు వరకు 210 నుంచి 214 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. సుమారు 20 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు. ప్రభుత్వం వీటికి త్వరలోనే రీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం నాటికి 162 దుకాణాలకు 1,015 దరఖాస్తులు రాగా... శనివారం మరో 52 దుకాణాలకు వెయ్యి అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెప్పారు.

    జిల్లావ్యాప్తంగా గత ఏడాది 231 దుకాణాలకు అనుమతి ఇవ్వగా... 12 షాపులపై వ్యాపారులు ఆసక్తి చూపలేదు. పలుమార్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ... ఆయా దుకాణాలను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. కాగా, మద్యం షాపులను దక్కించుకునేందుకు మహిళలు సైతం అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. వరంగల్‌తో పాటు మహబూబాబాద్ యూనిట్‌కు మహిళల నుంచి అప్లికేషన్లు వచ్చాయి.  
     
    ఫారాల రూపేణా రూ. 5 కోట్ల ఆదాయం
     
    మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యాపారి 10 శాతం ఈఎండీ కింద రూ.3,25,000తోపాటు మరో రూ.25 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. అయితే దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు మొదటి దఫాగా 1/3వ వంతు లెసైన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వారి ఖాతాల్లో ఈఎండీ జమ అవుతుంది. లిక్కర్ షాపులు రాని వారికి ఈఎండీ కింద చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దరఖాస్తు ఫారం ఫీజుగా చెల్లించే రూ.25 వేలు మాత్రం నాన్ రిఫండబుల్‌గా ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వానికి రెండు వేల దరఖాస్తుల పేరిట రూ. 5 కోట్ల ఆదాయం సమకూరింది. హన్మకొండలోని రెడ్డి ఫంక్షన్ హాలులో సోమవారం కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన మద్యం షాపులు కేటాయించనున్నారు.
     
    జూలై 1 నుంచి కొత్త పాలసీ
     
    రాష్ర్టవ్య్రాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. చిన్న సవరణలతో ముందుకు వచ్చిన ఎక్సైజ్ పాలసీ ఈ దఫా కూడా వ్యాపారులకు లాభసాటిగా లేకుండా పోయింది. దీంతో దుకాణాలను తీసుకునేందుకు వ్యాపారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దఫా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ బార్ కోడింగ్ సిస్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సిస్టం ద్వారా సరుకు కొన్న వినియోగదారులు ప్రతిఒక్కరికీ  వైన్ షాపు నిర్వాహకులు ఎలక్ట్రానిక్ బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఆన్‌లైన్‌లో పర్యవేక్షణలో ఉండడం, ఎమ్మార్పీని కచ్చితంగా అమలు చేయాల్సి వస్తుండడం.... కల్తీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా పోతుండడంతో ఈ విధానంపై వ్యాపారులు విముఖత చూపుతున్నారు.
     
    రంగంలోకి లిక్కర్‌డాన్‌లు
     
    దరఖాస్తు తుదిగడువు రోజున లిక్కర్ డాన్‌లు రంగంలోకి దిగారు. గతంలో  ఏసీబీకి పట్టుబడి ఊచలు లెక్కబెట్టిన నలుగురు డాన్‌లలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. వీరు జిల్లాలో లిక్కర్ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంలో సుమారు 120 దుకాణాలకు బినామీలతో దరఖాస్తు చేయించినట్లు సమాచారం. లిక్కర్ వ్యవస్థను సిండికేట్ చేసి ఎక్సైజ్ శాఖను తమ గుప్పిట్లోకి తీసుకుని ఏడాదిపాటు తాము చెప్పిందే వేదంగా జిల్లాలో నడువాలనే ధోరణితో లిక్కర్ డాన్‌లు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement