తెలంగాణకు సంపూర్ణసహకారం
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు
* సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం
* సానుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నిస్తా..
* ఊరూరా గోదావరి జలాలు రావాలి.. ప్రజల కష్టాలు తీరాలి
* కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యాసాగర్‌రావుకు ఘనంగా పౌర సన్మానం
* ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై చొరవ చూపాలని కోరిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఊరూరా గోదావరి జలాలు రావాలి. ప్రజల కష్టాలు తీరాలి. సముద్రం లేదనే లోపాన్ని దూరం చేసుకునేలా గోదావరి నదిని నౌకాయానికి వీలుగా తీర్చిదిద్దాలి. ఈ రెండు సుసాధ్యమే. గోదావరి నీటితో తెలంగాణ లబ్ధి పొందేలా మహారాష్ట్ర గవర్నర్‌గా నాకున్న అధికారాలను వినియోగిస్తాను. అక్కడి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తాను’’ అని ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారమిక్కడ ఆయనకు పౌర సన్మానం నిర్వహించింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ తదితరులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగరరావు మాట్లాడుతూ... ఎంతో విలువైన గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులు సాఫీగా పూర్తయ్యేందుకు వీలుగా.. మహారాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌గా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఈ పౌరసన్మానం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ‘‘ఇప్పుడు కొందరు నేతలు వింతగా వ్యవహరిస్తుంటారు. ఆ మధ్య కేసీఆర్ సింగపూర్ వెళ్తే... ఓ నేత నాదగ్గరకొచ్చి ‘అన్నా... కేసీఆర్ ఆరోగ్యం బాగోలేనట్టుంది. అందుకే విదేశాలకెళ్తున్నారు. గతంలో కేసీఆర్ కాళ్లు బాగా ఊపుతుండేవారు.. ఈ మధ్య బాగా తగ్గించారు.. అది అనారోగ్య లక్షణమేమో’ అని అన్నాడు. ఆయనకేం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడని నేను చెప్పి పంపా’’ అని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఇలా యద్భావం తద్భవతే అన్న తరహాలో నేతలు ఆలోచించొద్దంటూ చమత్కరించారు.
అధిష్టానాన్ని ఒప్పించిన నేత: కేసీఆర్
సుదీర్ఘకాలం కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్‌రావు పాత్ర అమోఘమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొనియాడారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవటంలో కృషి చేసిన వారిలో ఆయన కూడా ఒకరని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ నేత మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ కావటం అభినందనీయమని, ఆయనను సత్కరిస్తే తెలంగాణ తనకు తాను సత్కరించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు.
కరెంటు విషయంలో చర్చించేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా విద్యాసాగరరావు తనకు సహకరించారని, ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించేలా చొరవచూపుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజకీయాల్లో జెంటిల్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న విద్యాసాగరరావు నేటి తరం నేతలకు ఆదర్శప్రాయుడని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.