
దళితులపై దాడిని ఖండిస్తున్నాం
► టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
► సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నేరెళ్ల ఘటనపై ఫొటో ఎగ్జిబిషన్
► అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
► ఇసుక దందాపై విచారణ జరగాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో దళితులపై జరిగిన దమనకాండను ఖండిస్తున్నామని, బాధితు లకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. నేరెళ్ల ఘటనపై గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీడీపీ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది.
వివిధ పార్టీల నేతలు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బాధితులను చూసి కంట తడిపెడితే సీఎం కేసీఆర్ హేళన చేశారని, ఇలాంటి సంఘట నలపై అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఒక్కటైన పార్టీలకు అభినందన..
అట్టడుగు వర్గాల మీద జరిగిన దాడులను ఖండించడానికి ఏకతాటిపైకి వచ్చిన అన్ని పార్టీలను అభినందిస్తున్నానని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. లారీని తగుల బెట్టా రన్న నెపంతో పది కుటుంబాలను టార్గెట్ చేశా రని ఆరోపించారు. కులం పేరుతో దూషించిన తర్వాత ఇది దళితులపై జరిగిన దాడి కాదని ఎలా అంటారని, బాధ్యులపై అట్రాసిటీ కేసులు కూడా పెట్టాలని అన్నారు. ఇసుక దందాపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నేరేళ్ల బాధితులను తాను స్వయంగా కలిశానని, పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టారని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా పరిపాలన కాకుండా పోలీస్ పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ఎందుకు చిత్రహింసలకు గురిచేయాల్సి వచ్చిందో చెప్పాలని, చలో సిరిసిల్ల పాదయాత్ర కార్యక్రమానికి అన్ని పార్టీల సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
ఇసుక మాఫియాతో కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ కుటుంబమే ఇసుక మాఫియాను నడిపిస్తోందని, ఇందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. నేరెళ్ల బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల ఘటనను బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ నాయకుడు చింతా సాంబమూర్తి పేర్కొన్నారు. నేరేళ్లలో జరిగిన దాడులను సీపీఐ ఖండిస్తోందని ఆ పార్టీ నేత బాలస్వామి అన్నారు.