చంద్రబాబు పెంచిన నల్లతాచు నయీమ్ : సోలిపేట
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
* టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఆ రాక్షసుడు ఎదిగాడు
* నన్ను చంపేస్తానని 2004, 2008ల్లో బెదిరించాడు
* నేను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు
* చాలా పనులను అప్పటి ప్రభుత్వం నయీమ్‌ను అడ్డుపెట్టుకుని చేయించింది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరుడుగట్టిన నేరగాడు, గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెంచి పోషించిన బ్లాక్ కోబ్రా (నల్లతాచు) అని మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లుగా నయీమ్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారుల కనుసన్నల్లోనే ఈ రాక్షసుడు ఎదిగాడని చెప్పారు.
రాజ్యాంగ పరిధిలో చేయలేని పనులను నయీమ్‌ను అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వం చేయించిందన్నారు. 2004లో ఒకసారి, 2008లో మరోసారి నయీమ్ తనను బెదిరించాడని తెలిపారు. 2004 ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాన న్నాడని చెప్పారు. 2008లో కూడా నయీమ్, అతని అనుచరులు తమ గ్రామం చిట్టాపూర్‌కు వచ్చి తనను చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారని, దీనిపై తాను అప్పట్లో సిద్దిపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. నయీమ్ అరాచకాలపై అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు సోలిపేట తెలిపారు.
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో ఇద్దరిని, కొండపాకలో ఇద్దరిని నయీమ్ ముఠా కిడ్నాప్ చేసిందని, వారి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదన్నారు. నయీమ్ లాంటి నరహంతకుని పీడ విరగడ కావటం తెలంగాణ రాష్ట్ర సిద్ధి ఫలమే అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ప్రజలు కూడా పోలీసులకు అండగా నిలబడి వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచాలని సూచించారు.
ఈ జీవితం నాకు బోనస్
ఇరవై ఏళ్ల కిందట గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌లోనే తాను అమరుడిని కావాల్సిందని, ఆ రోజు అదృష్టం బాగుండి బయటపడ్డానని సోలిపేట చెప్పారు. ఇప్పుడున్న ఈ జీవితం, ఎమ్మెల్యే పదవి తనకు బోనస్ లాంటివేనన్నారు. నయీమ్ లాంటి హంతకుల హెచ్చరికలు తనకు వెంట్రుకతో సమానమని, తనకు ప్రాణాలపై తీపి, డబ్బుపై ఆశ లేవని చెప్పారు. తాను సాధారణంగా గన్‌మెన్ లేకుండానే ప్రజల్లో తిరుగుతానని, అయితే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు ప్రస్తుతం ఒకే ఒక గన్‌మ్యాన్‌ను పెట్టుకున్నానని తెలిపారు.