
ఘటనా స్థలంలో మృతదేహం (ఇన్‌సెట్) వెన్నెల (ఫైల్)
► యజమానికి తెలిస్తే...?
► ప్రాణం తీసిన ‘భయం’
► యువతి ఆత్మహత్య
మాదాపూర్: బెడ్‌పై మూత్రవిసర్జన చేసిన ఓ యువతి విషయం యజమానికి తెలిస్తే ఏమౌతుందోననే భయంతో 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలం, గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19) ఖానామెట్‌లోని మినాక్షీ స్కైలాంచ్ ఫోలరీస్ ఫ్లాట్ నెంబర్ 1606 లో అదే ప్రాంతానికి చెందిన మోహన్ కృష్ణరాజు ఇంట్లో నెల రోజులుగా పని చేస్తోంది. ఈమెకు నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. మంగళవారం రాత్రి తాను పడుకున్న బెడ్‌పై మూత్ర విసర్జన చేసింది. ఈ విషయం యజమానికి ఎక్కడ తెలిసిపోతుందోననే భయంతో వెన్నెల బుధవారం తెల్లవారుజామున 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.