సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం కాకుండా తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేసిన హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది వై.బాలాజీని హైకోర్టు సోమవారం అభినందించింది. భవిష్యత్ తరాలకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఈ పిల్‌ను దాఖలు చేసినందుకు పిటిషనర్‌ను అభినందిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే రూపాయి విలువ పతనం కావడానికి అంతర్జాతీయంగా అనేక కారణాలు ఉన్నాయని, వాటన్నింటి గురించి విచారించే పరిధి తమకు లేదని స్పష్టం చేసింది. రూపాయి విలువ పతనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)కు సలహాలు ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఇందుకు పిటిషనర్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.