
రూ.25 లక్షలు ఎందుకు డిపాజిట్ చేయలేదు?
ఆస్తుల వేలం ఖర్చుల నిమిత్తం రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు శుక్రవారం అగ్రిగోల్డ్ యాజమాన్యంపై మండిపడింది.
తదుపరి విచారణకల్లా డిపాజిట్ చేయాల్సిందే
లేకుంటే జైలుకు పంపుతాం
అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల వేలం ఖర్చుల నిమిత్తం రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు శుక్రవారం అగ్రిగోల్డ్ యాజమాన్యంపై మండిపడింది. తదుపరి విచారణకల్లా రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కారం కింద పరిగణించి అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఇక్కడి నుంచి ఇటే జైలుకు పంపుతామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఖాతాదారుల నుంచి రూ.7 వేల కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. విచారణ ప్రారంభం కాగానే వేలం పర్యవేక్షణ కమిటీ న్యాయవాది రవిప్రసాద్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. వేలానికి సంబంధించి తాము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, వాటికి కోర్టు ఆమోదముద్ర కావాల్సి ఉందని తెలిపారు. తరువాత ధర్మాసనం స్పందిస్తూ.. వేలం ఖర్చుల నిమిత్తం తాము రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని, ఆ డబ్బు డిపాజిట్ చేశారా? అని అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. లేదని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దీన్నిబట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కోర్టులంటే భయం లేదన్న విషయం స్పష్టమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.