అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సహకరించడంలేదని ఆ సంస్థ ఆస్తుల వేలం పర్యవేక్షణ నిమిత్తం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.వి.సీతాపతి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శుక్రవారం హైకోర్టుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
హైకోర్టుకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం పర్యవేక్షణ కమిటీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సహకరించడంలేదని ఆ సంస్థ ఆస్తుల వేలం పర్యవేక్షణ నిమిత్తం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.వి.సీతాపతి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శుక్రవారం హైకోర్టుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో తమ కమిటీని కొనసాగించే విషయాన్ని పరిశీలించాలని అభ్యర్థించింది. బ్యాంకుల తాకట్టులో ఉన్న, తగిన అనుమతులను లేని ఆస్తులను.. విక్రయించే ఆస్తుల జాబితాలో చేర్చి హైకోర్టునే తప్పుదోవ పట్టించిందని తెలిపింది. రెండు దఫాల వేలం ప్రక్రియ ముగిసిందని, జూన్ 23, 24 తేదీల్లో మూడో దఫా వేలం జరగనుందని, తరువాత వేలం వేసేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులేవీ గుర్తించి ఇవ్వలేదని తెలిపింది.
తమ కమిటీని కొనసాగించే విషయాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోరింది. ఆస్తుల వేలానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు వేలంపై ముందుకెళ్లేందుకు వివిధ అంశాలపై అనుమతులు కోరుతూ శుక్రవారం ఈ కేసు విచారణ సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనానికి కమిటీ న్యాయవాది రవిప్రసాద్ నివేదిక సమర్పించారు.
ఎంఎస్‌టీసీని తప్పించండి..: రెండు దఫాల ఆస్తుల వేలంలో వచ్చిన మొత్తాల వివరాలను నివేదికలో పొందుపరిచిన కమిటీ.. ప్రభుత్వరంగ సంస్థ ఎం.ఎస్.టి.సి. ఆస్తుల వేలంలో సమర్థంగా వ్యవహరించలేకపోతున్నందున వేలం బాధ్యతల నుంచి ఆ సంస్థను తప్పించాలని కోరింది.