కోర్టు ఆదేశాలు పాటించినా రోహిత్ దక్కేవాడు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిమ్న వర్గానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంటీగ్రేటెడ్ ఎంఏ (లింగిస్టిక్స్) చదువుతున్న 21 ఏళ్ల పీ. రాజు 2013లో యూనివర్శిటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో విద్యా వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టించింది. టీచర్ల కమ్యూనిటీ ఒక్కటై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదే ఏడాది ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ, ఇంగ్లీష్, విదేశీ భాషల యూనివర్శిటీసహా పలు యూనివర్శిటీ క్యాంపస్‌లలో అప్పటి వరకు జరిగిన 24 మంది విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆ పిల్‌లో పేర్కొంది.
విద్యార్థులు వచ్చిన సామాజిక పరిస్థితుల గురించి అవగాహన చేసుకోకుండా యూనివర్శిటీ అధికారులు, అధ్యాపకులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ పిల్‌లో ఆరోపించారు. ఆరు సెమిస్టర్లలో మంచి గ్రేడ్ తెచ్చుకున్న రాజు ఏడవ సెమిస్టర్‌లో గ్రేడ్ దిగజారినందుకు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాయాన్ని అందులో వివరించారు. తాను మానసిక ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని రాజు ఆస్ట్రేలియాలోవున్న స్నేహితురాలికి చెప్పుకున్నారు. యూనివర్శిటీ అధికారుల నుంచి, అధ్యాపకుల నుంచి సాయం తీసుకోవాల్సిందిగా ఆమె రాజుకు సూచించారు. అయితే ఈ యూనివర్శిటీలో సాయం చేసేందుకు తనకు ఎవరూ లేరంటూ రాజు బాధపడ్డారు. ఎన్నో రోజులుగా ఇలా మధనపడుతున్న రాజు చివరకు ఆత్మహత్యనే ఆశ్రయించారు. దీనికి ప్రేమ విఫలమే కారణమంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి అధికారులు సమర్థించుకున్నారు. రాజు మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన నిజ నిర్ధారణ కమిటీ మాత్రం అధికారుల మాటల్లో వాస్తవం లేదని తేల్చింది. మొత్తం నగరంలోని కాలేజీల్లో చోటుచేసుకున్న 24 మంది విద్యార్థుల మరణంపై ఓ సమగ్ర నివేదికను సమర్పించింది.
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులేనని కమిటీ పేర్కొంది. వారంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారవడం వల్ల పట్టణ సంస్కృతికి అలవాటుపడలేక సతమతమవడం, ఇంగ్లీషు నైపుణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచి రావడం, స్కాలర్‌షిప్పులు, ఫెల్లోషిప్‌లపైనే ప్రధానంగా ఆధారపడి బతకాల్సి పరిస్థితుల్లో కొన్ని కళాకాలలు వీటిని అర్ధాంతరంగా ఉపసంహరించడం, కళాశాలల్లోనూ కులాల మధ్య తేడాలు ఉండడం తదితర అంశాలన్నీ విద్యార్థుల ఆత్మహత్యలకు హేతువవుతున్నాయని నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఇంగ్లీషులో వెనకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు అదనపు క్లాసులు తీసుకోవాల్సిందిపోయి అవమానించడం కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక కారణమేనని కూడా నివేదిక తెలిపింది.
ఈ నివేదికలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013, జూలై ఒకటవ తేదీన విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అమలు చేయాల్సిన మార్గదర్శకాల గురించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వారితోని ఓ కమిటీని వేయాలని, వాటిని ఎప్పటికప్పుడు విచారించి పరిష్కరించేందుకు అకాడమిక్ కమిటీ ఒకటి ఉండాలని, వీలైతే ప్రతి విభాగానికి ఒక అకాడమిక్ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. రెండు కమిటీల మధ్య సమన్వయం కోసం అంబూడ్‌్లమేన్ ఉండాలని చెప్పింది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అంగవికలురకు ప్రత్యేక ప్రిపేటరీ కోర్సులు, బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టాలని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కౌన్సిలర్లను నియమించాలని హైకోర్టు సూచించింది. ‘నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసర్చ్ (నల్సర్)’ యూనివర్శిటీ అనుసరిస్తున్న ‘రెస్టోరేటివ్ జస్టిస్ టెక్నిక్స్ ( బాధితులు, నేరస్థుల అవసరాలను, వారి సామాజిక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పడం)’ను పాటించాలని, అందుకు ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఈ విషయంలో నల్సర్ లా యూనివర్శిటీ సహాయం తీసుకోవాలని చెప్పింది. కాలేజీల్లో అన్ని వర్గాల విద్యార్థులకు సమానావకాశాలను కల్పించేందుకు యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఇంకా ఇలా చాలా సూచనలే చేసింది. వాటిని అమలు చేసి ఉన్నట్లయితే రోహిత్ వేముల మనకు మిగిలేవారు.