
తాగిన మత్తులో భర్తను చంపేసింది
హైదరాబాద్: తాగిన మైకంలో భర్తను చంపేసిందో భార్య. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతలబస్తీలో జరిగింది. వివరాలివీ.. నల్లగొండ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వెంకటేష్, సుగుణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చింతలబస్తీలోని ఉంటున్నారు. కూలి పనులు చేసుకునే వెంకటేష్‌కు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో కుటుంబభారం సుగుణపై పడింది.
ఈ క్రమంలో వారిమధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి దంపతులు మద్యం తాగి ఆ మత్తులో వాదులాడుకున్నారు. కోపంతో రెచ్చిపోయిన సుగుణ రాడ్‌తో భర్త తలపై బాదింది. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం బయటకు రాలేదు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.