ఔటర్ రింగ్రోడ్డుపై అత్యాచారం.. హత్య
హైదరాబాద్ మహానగరంలో మరోసారి దారుణం జరిగింది. అభయ సంఘటనను ఇంకా మర్చిపోకముందే.. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ యువతిపై అత్యాచారం చేసి, హతమార్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కత్తులతో దాడి చేసి, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలిని రాజేంద్రనగర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలిని మహబూబ్నగర్ జిల్లా వాసిగా గుర్తించారు. తనపేరు శిరీష అని ఒకసారి, అనిత అని మరోసారి ఆమె చెప్పింది. కొంతమంది వ్యక్తులు ఆమెపై కారులో అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అర్ధరాత్రి వేళ అమెపై అత్యాచారం చేసి, కత్తులతో పొడిచి రోడ్డుమీద విసిరి పారేశారు. కొంతమంది వ్యక్తులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆమెను పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత వాళ్లు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో కొద్ది సేపటి తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ దారిలోనే ఆమె కొన్ని వివరాలు తెలిపింది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఉస్మానియా మార్చురీలో ఉన్న ఆమె మృతదేహం కోసం ఇంతవరకు బంధువులు ఎవరూ రాలేదు. ఔటర్ రింగ్రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులు వచ్చిన కారును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.