
వ్యభిచారం చేయమన్నాడని... ఆత్మహత్య చేసుకుంది
హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందనే కారణంగా భార్యను పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని... లేకుంటే వ్యభిచారం చేసి సంపాదించాలని భర్తతోపాటు అత్తమామలు వేధింపులు తాళ లేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన నగరంలోని ఎల్లారెడ్డిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది.
స్థానికంగా నివాసముంటున్న సదరు గృహణికి ఇటీవల ఆడపిల్ల జన్మించింది. దీంతో పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామల నుంచి వేధింపులు మొదలైయ్యాయి. అందుకు ససేమీరా అనడంతో వ్యభిచారం చేసి సొమ్ము సంపాదించి పెట్టాలని వారు గృహణిని వేధించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా భర్తతోపాటు అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.