
యూట్యూబ్‌లో శోధించి ఆత్మహత్య!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో సతమతమైన ఓ యువకుడికి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమనిపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి అతగాడు సులువైన దారుల కోసం అన్వేషించాడు. చివరకు ఆ యవకుడు యూట్యూబ్ను ఎన్నుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అని యూట్యూబ్లో శోధించి మరీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎక్కడో కాదు. నగరంలోని ఎస్సార్ నగర్ అనుపమ హాస్టల్‌లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. నల్లగొండ జిల్లాకు చెందిన నవీన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి ఎస్సార్ నగర్‌లోని అనుపమ వసతి గృహంలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ బుధవారం హస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు బలవన్మరణానికి ముందు ఆత్మహత్య చేసుకోవడానికి సులువైన దారుల కోసం యూట్యూబ్‌లో శోధించినట్లు తెలుస్తోంది.