వర్ష బాధిత ప్రాంతాలకు జగన్
- 26, 27 తేదీల్లో గుంటూరు జిల్లాలో పర్యటన
- వైఎస్సార్‌సీపీ నేత బొత్స వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. జిల్లాలో కురిసిన భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని, సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను ఆయన పరామర్శించనున్నారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. జగన్ తన పర్యటనలో బాధితుల వద్దకెళ్లి వారి ఇబ్బందుల్ని పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తెస్తారని, బాధితులకు ఆసరాగా నిలుస్తారని తెలిపారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. వారిని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బొత్స ధ్వజమెత్తారు. వర్షాలతో 1.10 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 3 లక్షలకుపైగా ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు తెలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలవల్ల ఎనిమిదిమంది మృతి చెందినట్లు సమాచారముందని, మృతుల కుటుంబాలను కూడా జగన్ ఓదారుస్తారని ఆయన వివరించారు.
ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు..
వర్షాలవల్ల ప్రజలకు తాగునీరు లభించట్లేదని, దోమకాటు వల్ల ఫ్లూ, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి విషజ్వరాలతో తల్లడిల్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బొత్స దుయ్యబట్టారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి చెత్తపాలనను ఎప్పుడూ చూడలేదన్నారు.
హోదాతో ప్రయోజనం లేదన్నారే!?
జీఎస్టీ అమలులోకి వస్తోంది కనుక ప్రత్యేకహోదావల్ల చాలా మేలు జరుగుతుందని వైఎస్సార్‌సీపీ చెబితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదని చంద్రబాబు, వెంకయ్యనాయుడు చెప్పారని, ఇప్పుడు కేంద్రప్రభుత్వం స్పష్టంగా ప్రత్యేకహోదా ఉన్న ప్రాంతాలకు జీఎస్టీలో మినహాయింపు ఉంటుందని ప్రకటించిందని బొత్స తెలిపారు. ‘‘జీఎస్టీలో మినహాయింపు వల్ల ఎంతో మేలు జరుగుతుంది కదా? దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? బీజేపీలో ఆంధ్రా వ్యవహారాలు చూస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏమంటారు?’’ అని ఆయన ప్రశ్నించారు.