‘యువభేరి’ని విజయవంతం చేయండి
⇒ విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలి
⇒ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరం నల్లపాడురోడ్డు, మిర్చియార్డు సమీపంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే యువభేరి సదస్సును విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులనుద్దేశించి ప్రసగించి, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో మిర్చియార్డు సమీపంలో ఇంతకు ముందు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష చేసిన ప్రదేశంలోనే యువభేరి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. సదస్సుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, పెద్దలు, మేధావులు తరలిరావాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ధర్నా మొదలు, వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. ఇది ఆరుకోట్ల మంది ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు.
రోజాను నిర్బంధించడం అప్రజాస్వామికం..
అమరావతిలో మహిళా పార్లమెంటు సదస్సు పెట్టి, ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి, అప్రజాస్వామికంగా, నిర్బంధించడంపై బొత్స మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున డీజీపీ మాట్లాడుతూ శాసనసభ్యురాలు స్పీకర్‌పై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ముందస్తు అదుపులోకి తీసుకున్నామని, సదస్సులో ఏం మాట్లాడుతుందో చెబితే పంపిస్తామని చెప్పడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థంతో ఉద్యమం చేయడం లేదని, బీజేపీ, టీడీపీ చెప్పినమాట మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామన్నారు.