రాష్ట్రంలోని మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌ల కింద భూముల సేకరణ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు.
ముంపు గ్రామాల వాసులకు ప్రతి ఎకరాకు రూ. 25 లక్షలు, కులవృత్తులు చేసుకునే వారికి రూ. 10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ రేటుకు నాలుగింతలు పెంచి అందజేయాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు, వివిధ రకాలుగా భూములు అనుభవిస్తున్న రైతులకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఇంటికి నలుగురు పోలీసులను పెట్టి భూసేకరణలో ప్రభుత్వం జీవో 123 ప్రకారం వెళ్తానంటే ప్రజలు, రైతుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో టాటా భూముల విషయంలో సీపీఎం వారు ఇలాగే వ్యవహరించి చేతులు కాల్చుకున్నారన్నారు. తన జిల్లానుంచే ప్రతిఘటన ఆరంభం కాకుండా సీఎం కేసీఆర్ చూచుకోవాలని వైఎస్సార్ సీపీ హెచ్చరిస్తోందని వారు చెప్పారు. 2013 భూ సేకరణ చట్టంలో ఏవేం అంశాలు ఉన్నయో వాటన్నింటినీ ప్రభుత్వం ఇక్కడి వారికి నెరవేర్చాలని సూచించారు.
సీఎం కేసీఆర్ కేవలం సిద్దిపేట, గజ్వేల్, తన ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నీరు తరలించేందుకు రీ డిజైన్ నాటకం తెర మీదకు తీసుకవచ్చారన్నారు. 25వేల ఎకరాల బంగారు భూమిని, 14 గ్రామాలను పూర్తి నీటి ముంచుతున్నారని వాపోయారు. 16 వేల జనాభా పూర్తి నిరాశ్రయులు కానున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే బంగారు భూమిని నీట ముంచటమా? అని వారు ప్రశ్నించారు.
మిత్రమా రేవంత్...బాబు వ్యభిచారం కన్పించలేదా..!
వివిధ పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవటం వ్యభిచారం అయినప్పుడు, ఏపీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అక్కడి సీఎం, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోటానుకోట్లు ఏర చూపి లాగేసుకోవటం వ్యభిచారంగా కన్పించలేదా అని వైఎస్సార్ సీపీ నేతలు ముకుమ్మడిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ రెండు నాల్కాల ధోరణి విడనాడాలని సూచించారు. ఇరురాష్ట్రాల సీఎంలు ఇలాగే వ్యవహరిస్తూ వెళ్తే, ముందు ముందు ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు.
బాబు రాజకీయ వ్యభిచారం మీకు కనిపించలేదా?
Published Fri, Jun 17 2016 5:08 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement