
ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి ప్రమాణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ప్రాంగణంలో ఉమ్మారెడ్డితో మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. గుంటూరు జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటాలో ఉమ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, బొత్సా సత్యనారాయణతో పాటు పలువరు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఉమ్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు.
తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు, గుంటూరు జిల్లా నేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులకు ఉమ్మారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పెద్దల సభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మారెడ్డి వెల్లడించారు.