
వారి విద్యార్హతల వివరాలెందుకివ్వలేదు?
- రాష్ట్ర శాసనసభ పీఐఓకు సమాచార హక్కు కమిషనర్ నోటీసు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి తదితరుల విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తూ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ అసెంబ్లీ పీఐఓ(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)కు నోటీసులు జారీచేశారు. జూలై 13న తన ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు తెలిపారు.
సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం తాను.. అసెంబ్లీలోని ఈ ఉన్నతాధికారులు టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వివరాలతోపాటు న్యాయశాస్త్ర పట్టాను వీరు ఎప్పుడు, ఎక్కడినుంచి పొందారనే సమాచారాన్ని ఇవ్వాలని 2015 నవంబర్ 10న సంబంధిత అధికారులను కోరానని తెలిపారు. మళ్లీ 2016 ఫిబ్రవరిలోనూ ఇదే సమాచారం కావాలని కోరానన్నారు. తాను అడిగినవి రహస్య పత్రాలేమీ కావని, అన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లేన న్నారు. చట్టప్రకారం నెలరోజుల్లో ఇవ్వాల్సిన ఈ సమాచారాన్ని ఏడెనిమిది నెలలైనా ఇవ్వకపోయేటప్పటికి సమాచార హక్కుకమిషనర్‌ను ఆశ్రయించడంతో ఈ విషయమై ఏపీ శాసనసభ పీఐఓకు నోటీసులు జారీ చేశారని ఆర్కే తెలిపారు.