'చంద్రబాబును ఎన్నిరోజులు సస్పెండ్ చేయాలి'
హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజాను శాసనసభలోకి అనుమతించకపోవడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం లోటస్ పాండ్లో పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభలోకి రాకుండా రోజాను అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డే అని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా పట్టించుకోరా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
ఇవాళ శాసనసభా ప్రాంగణం యుద్ధ వాతావరణాన్ని తలపించిందని ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? చంద్రబాబు నిరంకుశ పాలనలో ఉన్నామా అనిపిస్తుందన్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారని, కోర్టుకంటే తామే పెద్దవాళ్లమని చెబుతున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ రోజాను అడ్డుకోవడం దారుణమని గిడ్డి ఈశ్వరి అన్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని పాలన కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అకారణంగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, కనీసం ఆమెనుంచి సంజాయితీ కూడా కోరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలతో పాటు, కేసులు పెట్టి వేధిస్తున్నారని గిడ్డి ఈశ్వరి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు అన్యాయం చేస్తున్నారని, రోజానే కాదని, మహిళా జాతినే కించపరుస్తున్నారన్నారు. రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందనే సభ నుంచి సస్పెండ్ చేశామని చెబుతున్నారని, మరి ఎస్సీలుగా పట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబు నాయుడును మరి ఎన్నిరోజులు సస్పెండ్ చేయాలని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎమ్మెల్యే రోజాను సభకు అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. రోజా సస్పెన్షన్పై కచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు.