'రుణాల మాఫీ కాదు... హామీనే మాఫీ చేశారు'
హైదరాబాద్: డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మహిళలను నిండా ముంచిందని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం కాకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీనే ప్రభుత్వం మాఫీ చేసిందని ఎద్దేవా చేశారు.
గత రెండు బడ్జెట్లలో మహిళలకు అన్యాయం చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లోనూ నిరాశే మిగిల్చిందన్నారు. రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో సాధారణ వడ్డీలకు తోడు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 84 లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకోగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల మంది, 2015-16లో 46 లక్షల మంది రుణాలు పొందారని వివరించారు. మిగిలిన మహిళలు బ్యాంకు రుణాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఒక్కొక్కరికి రూ. 3 వేలు ఇస్తామంటున్నారని ఆమె చెప్పారు. 84 లక్షల మందికి రూ. 3 వేల చొప్పున ఇచ్చినా రూ. 2,500 కోట్లు కావాలని, కానీ ప్రభుత్వం రూ. 1000 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించిందని.. అంటే మిగతా రూ. 1500 కోట్లు ఎగనామం పెడతారని అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని రెండో సంతకం పెట్టారని, కానీ గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కువవుతున్నాయే గానీ, తగ్గడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న రెండంకెల వృద్ధి.. మద్యం అమ్మకాల్లోనే అని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం మహిళలను మరింత చిక్కుల్లోకి నెట్టిందని గౌరు చరితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.