
'కళ్లు మూసినా, తెరిచినా జగన్ నామస్మరణే'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కళ్లు మూసినా, తెరిచినా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు చుక్క నీరైనా ఇచ్చావా అని చంద్రబాబును నిలదీశారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'కేబినెట్ మీటింగ్కు, టీడీపీ మీటింగ్కు తేడా లేకుండాపోయింది. చంద్రబాబు ప్రభుత్వం పంచభూతాల్ని అవినీతిమయం చేసింది. ఏపీని స్కామాంధ్రప్రదేశ్గా మార్చారు. రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబూ.. మీ అవినీతి చూస్తూ ప్రజలు ఊరుకోరు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ఏపీ రాజధానిలో టీడీపీ నాయకులు పాల్పడ్డ భూదందా దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. మరో ముఖ్యమంత్రి అయితే ఈపాటికి రాజీనామా చేసేవారు. చంద్రబాబూ..తక్షణం విచారణకు సిద్ధం కావాలి' అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.