
నిరుద్యోగుల ర్యాలీకి వైఎస్సార్‌సీపీ తెలంగాణ మద్దతు
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి ధ్వజమెత్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు అప్పటి ప్రభుత్వాలు అనుమతినిచ్చిన విషయాన్ని ఒక ప్రకటనలో గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, ఉద్యమాలతో సాధిం చుకున్న రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదన్నారు.