
పెన్సిల్వేనియా : చేతి నుంచి కోడిగుడ్డు జారితే ఏమవుతుంది? కింద పడి పగిలిపోతుంది. అదే విధంగా కొన్ని లక్షల గుడ్లు రోడ్డు మీద పగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా ఇదే ఘటన పెన్సిల్వేనియాలోని హెగిన్స్ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. పెన్సిల్వేనియా ప్రాంతానికి చెందిన 66 ఏళ్ల జోసెఫ్ మైల్స్ అనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో హెగిన్స్ లోని రూట్ నెం. 125లో జోసెఫ్ తన ట్రక్కులో 1,36,000 గుడ‍్లను ఇంక్యుబేటర్‌లో పెట్టి తరలిస్తున్నారు. కాగా కొంతదూరం వరకు అతని ప్రయాణం సాఫీగానే సాగింది.
కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. హెగిన్స్ ప్రాంతం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో జంక‌్షన్ వద్దకు రాగానే ట్రక్కు అదుపుతప్పి ఒక్కసారిగా గుడ్లు కింద పడిపోయాయి. ఇంకేముంది రహదారి మొత్తం పచ్చసొన వరదలా మారింది. దీంతో రోడ్డుమీద పడిన పచ్చసొనను శుభ్రం చేయడానికి 20 వేల గ్యాలన్ల నీరు అవసరం అయిందంటూ హెగిన్స్ ప్రాంతం ఎమెర్జెన్సీ కో-ఆర్డినేటర్ బ్రియాన్ ముసోలినో వాపోయాడు. ' జోసెఫ్ మైల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎత్తైన ప్రాంతంలోకి ట్రక్కును తీసుకొచ్చి లక్షల గుడ్లు నేలపాలు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నాం' అని హెగిన్స్ పోలీస్ చీఫ్ బ్యూరో యర్ముష్ వెల్లడించారు. కానీ అక్కడి స్థానికులు మాత్రం బంగారం లాంటి గుడ్లను నేలపాలు చేశాడంటూ ట్రక్కు డ్రైవర్‌ను తిట్టిపోశారు.
Comments
Please login to add a commentAdd a comment