ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆత‍్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అబు షీర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన వరుస దాడుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.
ముందుగా పోలీస్ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో చెక్ పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన అనంతరం.. పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకొని ఇదే తరహాలో మరోదాడికి పాల్పడ్డారు. మొదటి దాడి తీవ్రత ఎక్కువగా ఉందని అంతర్గత వ్యవహారాలశాఖ అధికారి వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఈ ఘటనకు బాధ్యులం తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. ఇటీవల అక్కడి బస్రా ప్రాంతంలో జరిగిన దాడిలో 13 మంది మృతి చెందగా 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇరాక్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తరచుగా ఇలాంటి దాడులకు పాల్పడుతోంది.