బాంబుదాడి చేయనున్నట్టు బెదిరింపులు రావడంతో ఫ్రాన్స్కు చెందిన రెండు విమానాలను దారిమళ్లించారు.
పారిస్ ఉగ్రవాద దాడులతో విషాదంలో మునిగిపోయిన ఫ్రాన్స్ను ఉగ్రవాద నీడలు వెంటాడుతున్నాయి. బాంబుదాడి చేయనున్నట్టు బెదిరింపులు రావడంతో ఫ్రాన్స్కు చెందిన రెండు విమానాలను దారిమళ్లించారు. అమెరికా నుంచి పారిస్ వెళ్తున్న ఈ రెండు విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం.
మంగళవారం లాస్ ఏంజిలెస్ నుంచి ఎయిర్ ఫ్రాన్స్ 65 విమానం పారిస్కు బయల్దేరింది. కాసేపటి తర్వాత విమానాన్ని పేలుస్తారని బెదిరింపులు రావడంతో వెంటనే దారి మళ్లించి సాల్ట్ లేక్ సిటీలో ల్యాండ్ చేశారు. మరో విమానం వాషింగ్టన్ నుంచి పారిస్కు బయల్దేరగా, ఇదే కారణంతో దారి మళ్లించి నోవా స్కోటియాలో ల్యాండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి పారిస్ ఉగ్రవాద దాడుల్లో 129 మంది మరణించిన సంగతి తెలిసిందే.