ఐఫోన్ 7లో ఆ ఫీచర్లు వద్దు!
కాలిఫోర్నియా: సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ తీసుకురానున్న ఐఫోన్ 7 సిరీస్‌లో మార్పులను వినియోగదారులు స్వాగతించలేకపోతున్నారు. ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ లో ఉన్న ఫీచర్ల గురించి ఆన్ లైన్ లో అంతులేకుండా రూమర్లు వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్‌ను పూర్తిగా ఎత్తివేసి వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్‌ఫోన్లకు కనెక్ట్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది.
ఐఫోన్ 7కు సంబంధించి యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ప్రతిపాదిత ఫీచర్లపై ఐఫోన్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ఈ ఫీచర్లు వద్దని కోరుతూ యాపిల్ సంస్థకు లేఖ పంపేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై 2 లక్షల మందిపైగా సంతకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు? వీరంతా ఐఫోన్ అభిమానులేనా? అనేది తెలియడం లేదు.