ఇండియాలోనే అధికం...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. గర్భం, ప్రసూతి సమయాల్లో ఇండియాలో ప్రతి ఐదు నిమిషాలకు ఓ మహిళ మరణిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం ప్రసూతి మరణాల రేటు తీవ్రంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం సమయంలో పౌష్టికాహార లోపం, ప్రసవానంతరం రక్తస్రావం వంటి అనేక కారణాలతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది.
గర్భంవల్లో, ప్రసవం సమయంలోనో ప్రతి ఐదు నిమిషాలకు ఓ భారత మహిళ చనిపోతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు 5,29,000 ప్రసూతి మరణాలు సంభవిస్తుండగా వాటిలో అత్యధికంగా 25.7 శాతం భారత్ లోనే జరుగుతున్నట్లు లెక్కల ద్వారా కనుగొంది. వీటిలో ముఖ్యంగా ప్రసవానంతరం రక్తస్రావం వల్ల రెండొంతుల మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ వో తన ప్రకటనలో తెలిపింది. రక్తస్రావం, ప్రసవానంతర హెమరేజ్ (పీపీహెచ్) వల్ల పిల్లలు పుట్టిన 24 గంటల్లోపు 500 నుంచి 1000 మిల్లీ లీటర్ల రక్తం మహిళలు నష్టపోవడంవల్ల మరణాలు ఏర్పడుతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో నిర్వచించింది. భారత్ లో అధికంగా పీపీహెచ్ ఫలితంగానే మహిళల మరణాలు సంభిస్తుండటంతో ప్రసూతి మరణాలు తగ్గించడం, పునరుత్పత్తి, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉంచడమే ధ్యేయంగా మిలీనియం డెవలప్మెంట్ గోల్ దృష్టి సారించింది.
భారతదేశంలో బాలింతల మృతులు పెరుగుతున్న నేపథ్యంలో 2011-13 తాజా అంచనాల ప్రకారం సగటున లక్ష జననాల్లో 167 మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే అస్పాంలో అత్యధికంగా 300 మరణాలు, కేరళలో అతి తక్కువగా 61 మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో ప్రకటనలో తెలిపింది. ప్రతిదేశం కనీసం ఒక శాతం రక్తం రిజర్వ్ లో ఉంచుకోవాల్సి ఉండగా, ముఖ్యంగా ఇండియాలో దీర్ఘకాలిక కొరతవల్ల కూడ ఈ మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూ హెచ్ సూచిస్తోంది. 1,2 బిలియన్ల జనాభా ఉన్న ఇండియాలో సంవత్సరానికి 12 మిలియన్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, కేవలం 9 మిలియన్ల యూనిట్ల రక్తం మాత్రమే సేకరిస్తోంది. దీంతో సుమారు 25 శాతం రక్తం లోటు ఏర్పడుతోంది. భారత దేశంలో ఈ లోటు విషయాన్ని పెద్దగా పట్టించుకోపోవడం, రక్త సేకరణ విషయంలో అశ్రద్ధ వహించడం ఇందుకు కారణాలలౌతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో ప్రకటనలో తెలిపింది.