ముందస్తు పోలింగ్‌లోనూ హిల్లరీ-ట్రంప్ పోటాపోటీ
ముందస్తు పోలింగ్‌లోనూ హిల్లరీ-ట్రంప్ పోటాపోటీ
Published Fri, Nov 4 2016 10:24 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగిన ముందస్తు పోలింగ్‌లో దాదాపు 3 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో డెమొక్రాట్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ఆధిక్యంలో ఉండగా, మూడు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. నార్త్ కరొలినా, నెవడా, కొలరాడో, అయోవా రాష్ట్రాల్లో హిల్లరీ ముందున్నారు. అరిజోనా, ఫ్లోరిడా, ఓహియా రాష్ట్రాల్లో ట్రంప్ హవా కనిపించింది. ఈనెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముందస్తు పోలింగ్ కూడా అక్కడ ఉంటుంది.
అరిజోనాలో ఇప్పటివరకు 13 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ రిపబ్లికన్లకు 71వేల ఓట్ల ఆధిక్యం.. అంటే, 5.5 శాతం ఆధిక్యం కనిపించింది. ఫ్లోరిడాలో 16.95 లక్షల ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. అయోవాలో హిల్లరీ 41వేల ఓట్ల లీడ్‌లో ఉండగా పూర్తిగా మెయిల్ ద్వారానే ఎన్నికలు జరిగే కొలరాడోలో డెమొక్రాట్లు 18,500 ఓట్ల ఆధిక్యం లేదా 1.5 శాతం ముందున్నారు. నెవడాలో కూడా 29వేల ఓట్ల ఆధిక్యంలో హిల్లరీ ఉన్నారు. ఆమెకు ఉత్తర కరొలినాలో 2.43 లక్షల ఆధిక్యం లభించింది. ఓహియోలో ఈ వారం మొదట్లో ట్రంప్ ఆధిక్యం కనిపించింనా, తర్వాత డెమొక్రాట్లు 5 శాతం ముందంజలో ఉన్నారు.
మొత్తం 38 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి. ముందస్తు పోలింగ్‌లో పాల్గొనాల్సిందిగా తమ మద్దతుదారులను హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రోత్సహిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు రిజిస్టర్డ్ డెమొక్రాట్లలో 74 లక్షల మంది, రిపబ్లికన్లలో 64 లక్షల మంది మాత్రమే ఓట్లు వేశారు. అయితే.. ఇప్పటివరకు వచ్చినవి తుది ఫలితాలు కావు. పూర్తి బ్యాలెట్లను ఎన్నికల రోజు వరకు లెక్కించరు. మరో విషయం ఏమిటంటే.. డెమొక్రాట్లందరూ హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లికన్లందరూ డోనాల్డ్ ట్రంప్‌కు ఓటేస్తారని కూడా నమ్మకం లేదు. అమెరికా ఓటింగ్ చట్టాలను బట్టి 37 రాష్ట్రాలతో పాటు కొలంబియా జిల్లాలో కూడా ఎన్నికలకు ముందే వ్యక్తిగతంగా లేదా ఈ మెయిల్ ద్వారా ఓట్లు వేయొచ్చు. మరో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ రోజు హాజరు కాలేనివాళ్లు తగిన కారణంతో తర్వాత ఓటు వేసే వీలుంది. ఏడు రాష్ట్రాలు మాత్రం అసలు ముందస్తు ఓటింగ్‌ను అనుమతించవు.
Advertisement
Advertisement