
బాంబు దాడిలో కాలిపోయిన ఓ పౌరుడి మృతదేహం
తూర్ఫు ఘౌటా, సిరియా : సిరియా ప్రభుత్వ బలగాలు, రష్యన్ దళాలు తూర్పు ఘౌటాలో నరమేధానికి తెర తీశాయి. ఉగ్రవాద శక్తుల అణచివేతకు యత్నిస్తున్నామంటూ సిరియా బలగాలు తూర్పు ఘౌటాలో చేసిన బాంబు దాడిలో బంకర్ పేలి 37 మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
బాంబు దాడి అనంతరం ఘటన స్థలిలో ప్రాణాలు కోల్పోయిన వారి దేహాలను చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది. సిరియా పౌర రక్షణ దళం( కొందరు సాధారణ పౌరులు కలసి ఏర్పరచుకున్నారు) హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేసింది.
(బాంబుల వర్షం కురిపిస్తున్న సిరియా వాయుసేన ఫొటోలో)
ఘటనకు సంబంధించిన ఫొటోలను సిరియా పౌర రక్షణ దళం మీడియాకు విడుదల చేసింది. పూర్తిగా తగలబడిపోయిన శరీరాలతో కనిపిస్తున్న ఫొటోలు సిరియాలో వాస్తవాలను ప్రపంచానికి మరోసారి చూపిస్తున్నాయి. ఈ దాడిలో గాయపడిన వారికి తీవ్రగాయాలు అయినట్లు సిరియా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
అంతర్జాతీయంగా నిషేధించిన వైట్ ఫాస్పరస్ బాంబును ఈ దాడిలో సిరియా వాయుసేన వినియోగించిందని రిపోర్టులు చెబుతున్నాయి. కాగా, తమ దన్నుతో ఈ దాడి జరగలేదని తూర్పు ఘౌటా ఘటనపై రష్యా వివరణ ఇచ్చుకుంది.
2011లో సిరియా అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ 3,50,000 మంది మరణించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య అధికారిక లెక్కల్లో తప్పుగా ఉందని, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు మరణించారని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి.
బాంబుల దాడిలో గాయపడిన సిరియా పౌరులు
Comments
Please login to add a commentAdd a comment