
ఇంటర్నెట్‌లో ‘అధో’ జగత్తు!!
ఇంటర్నెట్‌లో బోలెడంత సమాచారం ఉంటుందని.. అది అందరికీ అందుబాటులో ఉంటుందనుకుంటాం..
- సెర్చింజన్ల ద్వారా చూడగలిగే సమాచారం 5 శాతమే
- మిగిలిందంతా మరో ప్రపంచం.. అదో వ్యాపార సామ్రాజ్యం
- మాదక ద్రవ్యాలు మొదలుకొని హత్యల వరకు..
- దొరకని వస్తువు లేదు.. జరగని పని లేదు..!
- చూడాలంటే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు, టెక్నిక్‌లు అవసరం
అమెరికాలో రాస్ ఉల్‌బ్రిట్ అనే వ్యక్తికి జీవిత ఖైదు పడింది!
చేసిన తప్పేంటి..?
సిల్క్ రోడ్ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూంటాడు
అక్కడ కూడా ఇంటర్నెట్‌పై ఆంక్షలున్నాయా?
కాదులెండి.. ఈ వెబ్‌సైట్ ద్వారా డ్రగ్స్ అమ్మేవాడట!
మాదకద్రవ్యాలు అమ్మితే శిక్ష వేయకుండా ముద్దుపెట్టుకుంటారా?
అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్!
గూగుల్‌లోగానీ.. మరే ఇతర సెర్చింజన్ లోనైనా ఈ వెబ్‌సైట్‌ను వెతకండి కనిపించలేదు కదా! కనిపించదు కూడా!
ఎందుకంటే.. మన కంటికి కనిపించే ఇంటర్నెట్‌లో ఈ వెబ్‌సైట్ ఉండదు!
మరెక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అంటే.. ఈ వార్త చదివేయండి మరి!!
ఇంటర్నెట్‌లో బోలెడంత సమాచారం ఉంటుందని.. అది అందరికీ అందుబాటులో ఉంటుందనుకుంటాం.. అయితే వాస్తవం దీనికి పూర్తిగా భిన్నం. ఇంటర్నెట్‌లో ఉన్న మొత్తం సమాచారంలో మనకు కనిపించేది పది శాతం మాత్రమేనట. మిగిలినదంతా మరో ప్రపంచమట!! దీంట్లో అడుగుపెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు, టెక్నిక్‌లు అవసరం. డార్క్‌నెట్ అని పిలుచుకునే ఈ ‘అధో’జగత్తులో రెండు భాగాలున్నాయి. ఒకటేమో.. విశ్వవిద్యాలయాలు.. పరిశోధన సంస్థలు, ఇతరులెవరికీ తెలియకుండా సమాచారం ఇచ్చిపుచ్చుకునేది. దీంతో పెద్దగా ప్రమాదం లేదు గానీ.. రెండో భాగమే చాలా ప్రమాదకారి. ఇక్కడ బిట్‌కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీ ఉండాలే గానీ.. కాంట్రాక్టు హత్యలు మొదలుకొని.. అన్ని రకాల మాదకద్రవ్యాల వరకు ఇక్కడ దొరకని వస్తువు లేదు.. చేయలేని పని కూడా లేదు. ఈ బ్లాక్‌మార్కెట్‌లో ఓ చిన్న పావు రాస్ ఉల్‌బ్రిట్.. అతడి సిల్క్ రోడ్ వెబ్‌సైట్!
ఇదీ రాస్ కథ..!
టెక్సస్‌లోని ఆస్టిన్ నగరంలో పుట్టిన రాస్ విలియం ఉల్‌బ్రిట్ 2011లో సిల్క్‌రోడ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు అంచనా. ‘డ్రెడ్ పైరేట్స్ రాబర్ట్స్’పేరుతో చెలామణి అయిన రాస్ ఈ వెబ్‌సైట్ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదివేల రకాల మాదక ద్రవ్యాలను అమ్మేవాడు. దీంతోపాటే అశ్లీల చిత్రాలు, ప్రొఫెషనల్ హంతకులు కూడా అందుబాటులో ఉండేవారు. ఏడాది తిరక్కుండానే రాస్ ఆనుపానులను డ్రగ్ డీలర్లుగా నటించి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) పోలీసులు గుర్తించారు. సిల్క్‌రోడ్‌ను మూసేశారు. అయితే రాస్ కొద్ది కాలానికే సిల్క్‌రోడ్ 2.0 అవతారమెత్తి మళ్లీ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈసారి.. అంటే 2013లో మరింత పకడ్బందీ ప్లాన్ వేసి అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ ఏజెంట్లు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. అరెస్ట్ అయ్యేనాటికి సిల్క్‌రోడ్ 2.0లో జరిగిన లావాదేవీలు.. ఏడాదికి దాదాపు 15 లక్షల డాలర్లు! చేతులు మారిన మొత్తం 120 కోట్ల డాలర్లు.. అంటే దాదాపు 8,400 కోట్ల రూపాయలన్నమాట!
డార్క్‌నెట్‌లోకి చేరడం ఆషామాషీ కాదు..
ఇంటర్నెట్‌లో దాదాపు 60 లక్షల కోట్ల వెబ్‌పేజీలు ఉన్నాయని గూగుల్ అంచనా. ఇందులో గూగుల్ సెర్చింజన్ చూడగలిగేది 5 శాతం మాత్రమే. ఇంకోలా చెప్పాలంటే ప్రతి మూడు వేల వెబ్ పేజీలకు గూగుల్ సెర్చింజన్ ఒక పేజీని మాత్రమే గుర్తించగలదు. మిగిలిందంతా డార్క్‌నెట్ లేదా డార్క్‌వెబ్ అంటారు. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైన రూటర్లు, ఏవైనా కొనుక్కోవాలంటే బిట్‌కాయిన్స్ ఉండాల్సిందే. తొలిరోజుల్లో అమెరికా రక్షణ శాఖ ఆర్పానెట్ పేరుతో ప్రారంభించిన సమాచార వ్యవస్థే ఇప్పుడు ఇంటర్నెట్‌గా రూపాంతరం చెందింది. ఈ ఆర్పానెట్ పరిధిలో లేకుండా రహస్యంగా ఇంకో నెట్‌వర్క్ ఉండేది. దీన్నే డార్క్‌నెట్ అని పిలిచేవారు. 2000 సంవత్సరంలో అమెరికా నావికాదళం టార్ పేరుతో అభివృద్ధి చేసిన రహస్య నెట్‌వర్క్, ఫ్రీనెట్ నెట్‌వర్క్ వంటివి అందుబాటులోకి రావడంతో డార్క్‌నెట్ మరింత విస్తరించింది. 2006 నాటికి టార్ నెట్‌వర్క్ నావికాదళం చేతుల్లోంచి మారిపోయి ఒక నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా మారిపోయింది. సాధారణ నెట్‌వర్క్‌లలోని సెర్చింజన్లకు దొరక్కుండా డార్క్‌నెట్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఇదీ డార్క్‌నెట్ మెనూ..
ఫేస్‌బుక్‌లో 15 మంది ఫ్రెండ్స్‌తో ఫేక్ అకౌంట్ సృష్టించాలంటే ఒక డాలర్
మాదక ద్రవ్యాలు 2 నుంచి 900 డాలర్లు
ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలంటే 7 డాలర్లు(గంటకు)
స్పామ్ మెయిళ్ల వ్యాప్తికి (5 లక్షల మెయిళ్లు) 50 డాలర్లు
వాన్నా క్రై వంటి మాల్‌వేర్ కావాలంటే.. 150 డాలర్లు
బ్యాంక్, క్రెడిట్ కార్డు వివరాలు 1,000 డాలర్ల పైమాటే
కాంట్రాక్ట్ హత్యలు 25,000 1,00,000 డాలర్లు
అణ్వాయుధాలు లక్షల డాలర్ల నుంచి కోట్ల డాలర్లలో