ఆరెండూ కలిస్తే... ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయ్! | Addiction to cocaine, alcohol can make you suicidal | Sakshi
Sakshi News home page

ఆరెండూ కలిస్తే... ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయ్!

Published Mon, Apr 11 2016 5:48 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

మద్యంతో పాటు కొకైన్ కూడ గణనీయంగా వినియోగించేవారు భవిష్యత్తులో ఆత్మహత్యాయత్నం చేసుకునే అవకాశం ఉంటుందని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం అల్పెర్ట్ మెడికల్ స్కూల్ ప్రధాన అధ్యయన రచయిత సారా అరియాస్ చెప్తున్నారు.

చెడు వ్యసనాలతో అనర్థాలు జరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇతర దుర్వ్యసనాలకంటే ముఖ్యంగా మద్యం, కొకైన్ వ్యసనంగా కలిగిన వారు భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు అమెరికా అధ్యయనకారులు. ఇటీవల నిర్వహించిన తాజా పరిశోధనల్లో ఈ కొత్త విషయాలను తెలుసుకున్నారు.

మోతాదులో మద్యం సేవించడం పెద్దగా ప్రమాదం కాదంటారు కొందరు. అయితే వ్యసనంగా మారినప్పుడు మద్యం కూడ ప్రాణాలమీదకు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యంతో పాటు  కొకైన్ కూడ గణనీయంగా  వినియోగించేవారు భవిష్యత్తులో ఆత్మహత్యాయత్నం చేసుకునే అవకాశం ఉంటుందని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం అల్పెర్ట్ మెడికల్ స్కూల్ ప్రధాన అధ్యయన రచయిత సారా అరియాస్ చెప్తున్నారు. ముఖ్యంగా కొకైన్, మద్యాలను కలిపి తీసుకునేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నట్లు క్రైసిస్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో అరియాస్ వివరించారు.

2010-2012 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది సూసైడల్ ఎమర్జెన్సీ విభాగాల్లో చేరిన 874 మంది రోగుల వివరాలను అధ్యయనకారులు పరిశీలించారు. అంతేకాక ఇటీవల ఆత్మహత్యా ప్రయత్నం చేసిన, పదేపదే ఆత్మహత్యా ఆలోచనలు వస్తున్నాయంటూ చికిత్స పొందుతున్న ఇతరుల వివరాలను కూడ అధ్యయనకారులు ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ లోని స్టాండర్డ్ కేర్ నుంచి సేకరించి విశ్లేషించారు. వీరిలో మొత్తం 298 మంది మద్యం దుర్వినియోగానికి పాల్పడిన వారు, 72 మంది కొకైన్ ఉపయోగించిన వారితోపాటు 41 మంది రెండూ కలపి వాడిన వారు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. అయితే గంజాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు, మత్తుమందులు, ఉత్ప్రేరకాలు సేవించే వారికన్నా... ముఖ్యంగా మద్యం కొకైన్ లు కలిపి సేవించిన వారే అత్యధికంగా ఆత్మహత్యా ప్రయత్నంతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకుల బృందం పేర్కొంది.  విడిగా మద్యం సేవించేవారిని, విడిగా కొకైన్ సేవించేవారిని పరిశీలించినప్పుడు మాత్రం మద్యం సేవించేవారిలో అటువంటి ఆలోచన ఏమాత్రం లేదని, కొకైన్ సేవించేవారు అటువంటి ఆలోచనకు సరిహద్దుల్లో ఉన్నారని తెలుసుకున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement