నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా అఫ్గానిస్థాన్‌లో వేలాది మంది ‘జనవరి 1’నే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో వివరించే కథనం ఇది.
కాబూల్: సమద్ అవాదీ ఏటా నూతన సంవత్సరం ప్రారంభమయ్యే జనవరి ఒకటిన పుట్టినరోజు జరుపుకుంటారు. నిజానికి అది ఆయన పుట్టిన తేదీ కానేకాదు. ఒక్క సమద్ ఏంటి.. ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, 32 మంది స్నేహితులూ జనవరి ఒకటినే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. అంతేనా.. అఫ్గానిస్థాన్‌లో ఇలా చేసే వాళ్లు వేలాది మంది ఉన్నారు. ఇందుకు ఒక కారణం ఉంది. వీళ్ల పుట్టిన తేదీ తెలియకపోవడం. జన్మదిన ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ రికార్డులు పుట్టినరోజును నమోదు చేయకపోవడంతో వీళ్లు ‘జనవరి 1’నే ఎంచుకుంటున్నారు. కొందరేమో పండుగలు, ముఖ్యమైన రోజుల ఆధారంగా తమ వయసును లెక్కించుకుంటారు.
అన్ని దేశాల మాదిరే అఫ్గాన్‌లోనూ ఫేస్‌బుక్ విస్తృతి పెరిగింది. ఇందులో చేరాలంటే పుట్టినతేదీని తెలియజేయడం తప్పనిసరి. పాస్‌పోర్టులకు, వీసాలకు దరఖాస్తు చేయాలన్నా పుట్టినతేదీ కావాల్సిందే! అందుకే ‘జనవరి 1’ని మెజారిటీ ప్రజలు ఎంచుకుంటున్నారు. కొంతమందికి నిజంగానే పుట్టినరోజు తెలిసినా ప్రయోజనం ఉండటం లేదు. ఎందుకంటే అఫ్గన్‌లో ఇప్పటికీ ఇస్లామిక్ క్యాలెండర్ ఉపయోగిస్తున్నారు. దాని ప్రకారం ఇప్పుడు 1365వ సంవత్సరం నడుస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ తేదీని అంగ్ల సంవత్సరంలోకి మార్చడం కష్టం కావడంతో జనవరి 1 తేదీకి ఆదరణ పెరిగింది. ‘నేను 2014లో తొలిసారి ఫేస్‌బుక్‌లో చేరారు. పుట్టినరోజుగా జనవరి ఒకటో తేదీని ఎంచుకోవడం సులువయింది. మా దేశంలో ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ తేదీని అంగ్ల సంవత్సర తేదీకి మార్చడం కష్టం’ అని 43 ఏళ్ల సమద్ వివరించారు. అఫ్గన్ ప్రభుత్వం పౌరులకు జారీ చేసే తజ్‌కిరా లేదా గుర్తింపుకార్డు కోసం దరఖాస్తుదారుడి ఆకారం, ముఖాన్ని బట్టి వయసును నిర్ధారిస్తారు.
ఉదాహరణకు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఒక వ్యక్తి 1365లో పుడితే ఆంగ్లసంవత్సరం ప్రకారం అతని పుట్టినతేదీ 1986 అన్నమాట. ఇది వరకైతే తజ్‌కిరాలో పుట్టిన తేదీ నమోదుకు స్థలమే ఉండేది కాదు. అందుకే చాలా మంది పుట్టినతేదీ తెలియదు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బిడ్డ పుట్టిన తరువాత ఆస్పత్రులు జన్మధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. తజ్‌కిరాలోనూ పుట్టినతేదీ చేర్చి కొత్తగా జారీ చేసే ప్రతిపాదన కూడా ఉంది. అయితే రాజకీయ, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ నిల్చిపోయింది. ఏదో ఒక రోజు తమ ప్రజలందరికీ పుట్టినతేదీలు తెలిసే రోజువస్తుందని సమద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment