చచ్చాక చంద్రుని పైకి..
చచ్చాక స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు గానీ.. చంద్రుడి మీదకు మాత్రం వెళ్లొచ్చు అంటున్నారు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఎలీజియం స్పేస్ నిర్వాహకులు. రూ.8 లక్షలు చెల్లిస్తే.. మనం మరణించిన తర్వాత మన అస్తికలను వాళ్లు చందమామ మీదకు తీసుకెళ్తారట. ఈ కంపెనీని నాసా మాజీ ఇంజనీర్ థామస్ సివీట్ స్థాపించారు. 2013లో ఈ కంపెనీని స్థాపించినప్పటికీ గత నెల నుంచే ఈ సర్వీసును ప్రారంభించారు. వాస్తవానికి ఎలీజియం కంపెనీ అస్తికలను అంతరిక్షంలోకి పంపాలని ప్లాన్ చేసుకుంది.
అయితే, ఓ వినియోగదారుడు తన తల్లి అస్తికలను చంద్రుడి మీదకు పంపాలని కోరడంతో ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇందుకోసం ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ 2017లో చంద్రుడి మీదకు గ్రిఫిన్ ల్యాండర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనుంది. అందులో ఈ అస్తికలను పంపుతారన్నమాట. ఇప్పటికే బుకింగ్ మొదలైంది. తొలిదశలో 100 మంది అస్తికలను పంపుతామని ఎలీజియం స్పేస్ కంపెనీ చెబుతోంది.