అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ట్విట్టర్ అకౌంట్ కు ఆదిలోనే చుక్కెదురైంది.
వాషింగ్టన్:అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ట్విట్టర్ అకౌంట్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఉగ్రవాద సంస్థ ఆల్ కాయిదా గత ఐదు రోజుల క్రితం అల్-ఇస్లామ్ వెబ్‌సైట్ పేరుతో ట్విట్టర్ లో ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. సిరియాలో ఇస్లామిక్ తిరుగుబాటుదారుల చీలిక నేపథ్యంలో వారిని ఐక్యం చేసే యత్నాల్లో భాగంగానే అల్ కాయిదా ఆరంభించిన ఈ ఖాతాను ఆరంభించినట్లు తెలుస్తోంది, కాగా ఈ ఖాతాను ఆదివారం ట్విట్టర్ నుంచి తొలగించినట్లు న్యూయార్క్ డైలీ తెలిపింది. ఇప్పటికే ఈ ఖాతాను 1500 మందికి పైగా ఫోలో అవుతున్నట్లు పేర్కొంది. దీనిని తొలగించిడానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు.
సిరియాలో అల్‌కాయిదాకు చెందిన రెండు తిరుగుబాటు ముఠాల మధ్య విభేదాలను పరిష్కరించే దిశగా ట్విట్టర్ ఖాతా ద్వారా అల్‌కాయిదా తొలి ట్వీట్ చేసినట్లు తెలిపింది. అల్‌కాయిదా ట్విట్టర్ ఖాతా ద్వారా 29 ట్వీట్లు చేసిందని, ఆ ఖాతాను ప్రముఖ జీహాదిస్టులతోపాటు 1,532 మంది అనుసరించారని సమాచారం. ఇంటర్‌నెట్ సాయంతో ఆన్‌లైన్ జిహాద్‌ను ప్రోత్సహిస్తూ ఉగ్రవాద సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయనడానికి దీనిని ఓ సూచికగా పరిగణించవచ్చని ఉగ్రవాద నిరోధక సంస్థల అధికారులు భావిస్తున్నారు.