సాక్షి, న్యూఢిల్లీ : ఆఫీసు నుంచి నీవు ఎంతో బడలికతో ఇంటికి వస్తావ్. చేతిలోని బ్యాగ్ తీసి సోఫాలో గిరాటేస్తావ్. టై విప్పుకుంటూ సోఫాలో కూలబడతావ్. ‘ఏమేవ్, ఎక్కడ చచ్చావే! వేడి వేడి టీ పట్టుకురావాలని తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలి!’ అంటూ భార్య మీద విసుగ్గా అరుస్తావ్. అంతలో ‘గూగుల్’ సేవలు గుర్తొస్తాయ్. ‘హే గూగుల్! ఫ్యాన్ ఆన్‌చేయి. టీవీ పెట్టు, వ్యాల్యూమ్ తగ్గించు. చీకటవుతోంది బయట వసారాలో లైట్ వేయి, మధ్య రూమ్‌లో ఫ్యాన్, లైట్ ఆర్పేయ్!’...ఇంతలో కాస్త ఆలస్యంగా భార్య వేడి వేడి చాయ్‌తో వస్తుంది. టీ కప్పు చేతికిస్తుంది. ఓ గుక్క టీ తాగి గూగుల్ సేవలు భార్యకన్నా బాగున్నాయ్ అనుకుంటావ్ నీవు. అసలు విషయం తెలిస్తే అదిరిపోతావ్.
ఇప్పటి వరకు ‘గూగుల్ అసిస్టెంట్’కు నీవిచ్చిన ఆదేశాలనే కాకుండా అంతకుముందు భార్యను ఉద్దేశించి ‘ఏమేవ్, ఎక్కడ చచ్చావే’ అంటూ నీవు విసుక్కున్న మాటలన్నింటినీ గూగుల్ హోం స్పీకర్లు రికార్డు చేస్తాయ్. పొద్దున మారాం చేస్తున్న పిల్లల్ని విసుక్కోవడం, పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదంటూ భార్యను తిట్టడం, ఏందయ్యా గోలంటూ పక్కింటి పరాందమయ్య మందలింపుపై వంటికాలిపై లేవడం, బూతు మాటలందుకోవడం.. అన్నీ రికార్డవుతాయి. అంతేకాదు గత రాత్రి భార్యతో పంచుకున్న ప్రేమ కలాపాల మాటలు రికార్డవుతాయ్! ఇదంతా ‘గూగుల్ అసిస్టెంట్’గా పిలిచే ‘గూగుల్ స్పీచ్ లేదా వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ ఫలితం. అమెజాన్ అలెక్సా, సిరి కూడా ఈ టెక్నాలజీకి సంబంధించినవే.
ఈ పరికరాలు మనం ఇంట్లో మాట్లాడే ప్రతిమాటను రికార్డు చేస్తాయ్. చేస్తున్నాయ్! వాటిని తమ సంస్థ ఆడియో డేటా బేస్‌కు పంపిస్తాయ్. గూగుల్ కంపెనీ ఆ ఆడియో డేటాలను ‘వాయిస్ రికార్డింగ్ టెక్నాలజీ’ని మరింత అభివృద్ధి చేయడం కోసం సబ్ కాంట్రాక్టర్‌కు పంపిస్తోంది. ఆ సబ్‌కాంట్రాక్టర్ ఉద్యోగులు ఆ ఆడియో టేపులను విని వాటి స్క్రిప్టును కూడా రాసుకుంటారు. అసలు బండారం వీరి వద్ద నుంచే వేగుల ద్వారా బెల్జియంలోని వీఆర్‌టీ, ఎన్‌డబ్లూఎస్ ఛానళ్లకు లీకయింది. వాటిలో మచ్చుకు వేయి ఆడియో టీపులను ఈ రెండు సంస్థలు సేకరించాయి. వాటిల్లో భార్యాభర్తలు కొట్టుకోవడం, తింటుకోవడం దగ్గరి నుంచి వారి శృంగార లీలల వరకు ఉండగా, పిల్లల అల్లరి, ఆకతాయి చేష్టలు, వారి మధ్య జరిగే సంభాషణలు అన్నీ ఉన్నాయి.
ఇదే విషయంలో అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఓ తల్లి అమెజాన్‌కు చెందిన ‘అలెక్సా’కు వ్యతిరేకంగా సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టుకు ఆశ్రయించారు. పిల్లల మాటా ముచ్చట్లను, చర్చలను అన్నింటిని అలెక్సా రికార్డు చేస్తోందని, ప్రైవసి లేకుండా పోయిందంటూ ఆ తల్లి తన పదేళ్ల కూతురితోపాటు కొంత మంది పిల్లల తరఫున కోర్టుకెక్కారు. అలాంటి డేటాను తాము ఎక్కడా బహిర్గతం చేయమని అమెజాన్ హామీ ఇస్తుండగా, ఎప్పటికప్పుడే వినియోగదారుడే తమ డివైస్ నుంచి డేటాను తొలగించుకుంటే సరిపోతుందని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది.
ఇప్పటి వరకు మన ఊరు, పేరు, చిరునామాను బట్టబయలు చేస్తున్నారు, ఇది ప్రైవసీ హక్కులకు విరుద్ధమంటూ ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టుకు, మన అభిప్రాయాలను ఫేస్‌బుక్ అమ్ముతోందంటూ అంతర్జాతీయ కోర్టుకెక్కి గోల చేస్తున్న మనం, ఇప్పుడు మన ఇంటి గుట్టును బజారులో పెడుతున్న ఈ కొత్త టెక్నాలజీపై ఎక్కడిదాకా వెళ్లాలో!?
Comments
Please login to add a commentAdd a comment