‘మరిచిపోయి’.. మళ్లీ పెళ్లి..!
అమెరికాకు చెందిన ఈ ‘నవ’దంపతులు అమందా కార్త్, కోడీ కార్త్.. పది నెలల క్రితమే ఒకరినొకరు ఇష్టపడి ఘనంగా మనువాడారు.. ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు! విడాకులు తీసుకుని మళ్లీ అదే జంటలు పెళ్లి చేసుకోవడం అమెరికాలో కొత్తేమీ కాదు కానీ.. వీరి కథ మాత్రం చాలా వెరైటీ. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... అమందా, కార్త్ పెళ్లిరోజు. వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. కేక్ కట్ చేసి, పెళ్లి డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఫొటోలు, వీడియోల ముచ్చటా తీరింది. చివరగా పడకగదికి చేరారు.
కానీ, పొద్దునే శ్వాస తీసుకోలేక అమందా అటూ ఇటూ దొర్లడంతో కార్త్ నిద్రలేచాడు. అంతలోనే ఆమె గుండె ఆగిపోయింది. వెంటనే ఆమె ఛాతీపై గట్టిగా నొక్కుతూ ప్రథమ చికిత్స చేయడంతో.. గుండె తిరిగి కొట్టుకుంది. కానీ.. బ్రోకెన్ హీట్ సిండ్రోమ్ అనే ఈ సమస్య వల్ల ఆమె కోమాలోకి వెళ్లింది. నాలుగు రోజులకు కళ్లు తెరిచింది. కానీ, 27 ఏళ్ల జీవితంలో అన్నీ గుర్తున్నాయి కానీ.. పెళ్లిరోజు మాత్రం ఆమె మెదడు నుంచి పూర్తిగా చెరిగిపోయింది! ఫొటోలు, వీడియోలు చూపించినా.. పెళ్లి జ్ఞాపకాలు గుర్తురాలేదు. ఇటీవల వీరి కథ తెలుసుకున్న ఇన్‌సైడ్ ఎడిషన్ మ్యాగజైన్‌వారు అమందాకు పెళ్లి జ్ఞాపకాలను కానుకగా అందించాలనుకున్నారు. మళ్లీ పెళ్లి చేసి, అమందా ముచ్చట తీర్చారు.