మార్స్‌పై 350 కోట్ల ఏళ్ల క్రితం హిమానీనదాలు!
అరుణగ్రహంపై ప్రస్తుతం నాసా క్యూరియాసిటీ రోవర్ తిరుగుతున్న గేల్ క్రేటర్ ప్రాంతంలో ఒకప్పుడు హిమానీనదాలు, సరస్సులు ఉండేవట. గేల్ క్రేటర్ ప్రాంతంలో సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం చాలా చల్లని నీరు నదులుగా ప్రవహించడమే కాకుండా లోతట్టుప్రాంతాల్లో సరస్సులూ ఉండేవట. నీటి ప్రవాహాల కారణంగా భూమిపై అలాస్కా, ఐల్యాండ్ వంటి చోట్ల ఏర్పడిన తరహాలో మైదానాలు కూడా మార్స్‌పై ఏర్పడ్డాయట.
అంగారకుడిపై ఇటీవలే ఒక సంవత్సరం(మనకు 687 రోజులు) పూర్తిచేసుకున్న క్యూరియాసిటీ తీసిన చిత్రాలను, మార్స్ చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ వివరాలు తెలిశాయని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. చిత్రంలో ఎడమవైపున మార్స్‌పై ఒకప్పుడు హిమానీనదాల వల్ల ఏర్పడిన ఉపరితల మార్పులు కాగా.. కుడివైపున ప్రస్తుతం భూమిపై ఐల్యాండ్ ప్రాంతంలోని ఓ గ్లేసియర్ వద్ద జరిగిన ఉపరితల మార్పులు.