సియోల్: అమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు, ఆంక్షలను పెడచెవినపెడుతూ ఉత్తరకొరియా మరోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ఉన్ బుధవారం ప్రకటించారు. ఈ క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలమని ఆ దేశ మీడియా చెప్పింది. ఉ.కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, ద.కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి.
4,475 కి.మీ ఎత్తులో..
ఉ.కొరియా విజయవంతంగా పరీక్షించిన ఖండాంతర క్షిపణుల్లో ఇది మూడోది. గత రెండు నెలల కాలంలో మొదటిది. గతంలో ప్రయోగించిన వాటి కన్నా తాజా క్షిపణి ఎంతో అధునాతనమైనదని ఉ.కొరియా వెల్లడించింది. హవాసాంగ్–15గా పిలిచే ఈ ఖండాంతర క్షిపణి 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని పేర్కొంది. ఉ.కొరియాకు చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత రి చున్–హీ అధికారికంగా ఈ ప్రయోగం గురించి ప్రకటన చేశారు.
‘అణు దేశంగా అవతరించాలనుకుంటున్న తమ కల ఎట్టకేలకు నెరవేరిందని అధ్యక్షుడు కిమ్ సగర్వంగా ప్రకటించారు. ఉ.కొరియా ప్రజలు సాధించిన ఈ విజయం వెల కట్టలేనిది’ అని తెలిపారు. భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేసే సత్తా ఈ క్షిపణి సొంతమని ఉ.కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఈ వార్త తెలియగానే రాజధాని పాంగ్యాంగ్‌లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తమ ప్రయోజనాలు దెబ్బతిననంత వరకు ఏ దేశం, ప్రాంతానికీ తమ ఆయుధాలతో ఎలాంటి ముప్పు లేదని ఉ.కొరియా చెప్పింది.
డొనాల్డ్ ట్రంప్ చర్చలు
ఉ.కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అత్యవసరంగా ఫోన్‌లో చర్చలు జరిపారు. ఉ.కొరియా దుందుడుకు చర్యలు అమెరికాకే కాకుండా జపాన్, దక్షిణ కొరియా, మొత్తం ప్రపంచానికే ముప్పని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఉ.కొరియా తీరును ఖండించిన నలుగురు నేతలు తాజా పరిణామాలు ఆ దేశ భద్రతను దిగజార్చటంతో పాటు, దౌత్య, ఆర్థిక రంగాల్లో మరింత ఏకాకిని చేస్తాయని హెచ్చరించినట్లు శ్వేతసౌధం తెలిపింది.‘మేం చూసుకుంటాం. మేము ఈ పరిస్థితిని ఎదుర్కోగలం’ అని ట్రంప్ మీడియాతో చెప్పారు.
ఉ.కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం అక్రమం, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ అన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ స్పందిస్తూ...ప్రపంచ శాంతికి అస్థిరత కలిగించే చర్యలను మానుకోవాలని సూచించారు. తాజా ప్రయోగం ఆసియాలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుందని రష్యా హెచ్చరించింది. ఉ.కొరియా మిత్ర దేశం చైనా కూడా క్షిపణి ప్రయోగాన్ని ఖండిస్తూ...కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దిగొద్దని ఆ దేశానికి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment