వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లింది. ఈ దాడుల్లో 14 మంది మరణించగా, 226 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అంకారా: వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లింది. ఈ దాడుల్లో 14 మంది మరణించగా, 226 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని పోలీస్‌స్టేషన్ల సమీపంలో మొదట రెండు కారు బాంబులు పేలాయి. తర్వాత ఆగ్నేయ టర్కీలో సైనికులను తరలిస్తున్న మిలటరీ వ్యాన్ లక్ష్యంగా చేసుకొని రోడ్డు పక్కన అమర్చిన మరో బాంబు పేలింది. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటన చేయలేదు. బుధవారం అర్ధరాత్రి తూర్పు టర్కీలోని వ్యాన్ లేట్‌లో మొదటి కారు బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి, ఇద్దరు పౌరులు మరణించారు.
20 మంది పోలీసులు, 53 మంది పౌరులు గాయపడ్డారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే గురువారం తెల్లవారుజామున ఎలాజిగ్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద మరో కారును పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించగా, 146 మంది గాయపడ్డారు. 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని కార్లు నాశనమవ్వగా, భవనాలు దెబ్బ తిన్నాయి.