'నేను డర్టీ అయ్యాను..నన్నెవరూ ప్రేమించరు'
అరిజోనా: కొంతమంది జీవితాలు పరిశీలిస్తే నిజంగా విధిరాత ఉందేమో అనిపిస్తుంటుంది. కళ్లముందే అందనంత ఎత్తులో ఉన్నవారు ఒక్కోసారి అమాంతంపడిపోతారు. అది కూడా ఇంకెప్పటికీ లేవనంత స్థితిలోకి దిగజారేలా. అచ్చం ఇలాంటి సంఘటన ఓ అందాల భామ జీవితంలో చోటుచేసుకుంది. ఎరిన్ డాల్బీ అనే మహిళ 1996 ప్రాంతంలో ఒక వెలుగు వెలిగింది. మిస్ అరిజోనాగా బంగారు కిరీటాన్ని దక్కించుకుంది. కానీ, ఆ ముచ్చట ఎంతోకాలం నిలవలేదు. స్నేహితుల పుణ్యమో.. వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదమో మొత్తానికి మత్తుపదార్థాలకు బానిసగా మారింది.
అది కూడా మిస్ అరిజోనాగా నిలిచిన మూడేళ్లకే. 1999లో ఆమె డ్రగ్స్ బానిసత్వం విపరీతంగా మారి 2010 వరకు అంటే దాదాపు పదేళ్లపాటు కొనసాగింది. ఆ పదేళ్లలో ఏమేం చేసిందో ఆమెకే తెలియలేదు. మత్తులో తూగింది. 34 ఏళ్లు వచ్చేసరికి ఇక ఆమె సమాజంలో ఎక్కువగా తిరగలేనని గుర్తించింది. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండలేనని నిర్ధారించుకుంది. ఎందుకంటే అనారోగ్యం కారణంగా వైద్యుల వద్దకు వెళ్లిన ఆమెకు ఓ భయంకరమైన విషయం తెలిసిందే. ఆమె హెచ్ఐవీ బారిన పడినట్లు వైద్యులు చెప్పారు.
ఆ సమయంలో తన మనసులో తనకుతాను 'నేను పనికిమాలినదాన్ని.. నేను పూర్తిగా చెడిపోయాను. ఇక నన్నెవరూ ప్రేమించరు. నేను చనిపోతాను' అని అనుకొని కుమిలిపోయింది. ఆమె ఆలోచన తీవ్రతను ముందే గమనించిన వైద్యులు మానసిక వైద్యుడిని ఆమె వద్దకు పంపించడంతో అతడు ఆమెకు ధైర్యం నూరిపోశాడు. మళ్లీ సాధారణ జీవితం గడపవచ్చని బోధించి ధైర్యం చెప్పాడు. ప్రత్యేకమైన వైద్యం చేయించుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవొచ్చన్నాడు. అతడు చెప్పిన ప్రకారం ఆమె నడుచుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిది నెలల బాబు, భర్తతో కలిసి ఆనందంగా ఉంటూ హెచ్ఐవీపై సమాజానికి అవగాహన కల్పించే పోరాటాన్ని చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతోంది.