గూగుల్‌నే ఫూల్‌ చేశాడు! | Berlin Man Creates Fake Traffic Jam And Fools Google Map | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ట్రాఫిక్‌జామ్‌ సృష్టించి గూగుల్‌నే బురిడీ కొట్టించాడు

Published Tue, Feb 4 2020 9:54 AM | Last Updated on Tue, Feb 4 2020 10:10 AM

Berlin Man Creates Fake Traffic Jam And Fools Google Map - Sakshi

బెర్లిన్‌: అందరికీ పెద్ద దిక్కైన గూగుల్‌నే బురిడీ కొట్టించాడో ఘనుడు. గూగుల్‌ మ్యాప్‌ మనలాంటి సాధారణ ప్రయాణికులతో ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌ రైడింగ్‌ వ్యాపారాలకు కూడా ఎంతో అవసరమైనది. అలాంటి దిగ్గజ యాప్‌ను తప్పుదారి పట్టించాడో వ్యక్తి. ప్రయాణానికి రెడీ అయ్యేముందు మనం వెళ్లే రూటులో ఎక్కడ ట్రాఫిక్‌ రద్దీ తక్కువగా ఉందో చూసుకున్నాకే బండి బయటకు తీస్తాం. అలాంటిది గూగుల్‌ మ్యాపే స్వయంగా ఫలానా మార్గంలో ట్రాఫిక్‌ ఉందని వేరే రూటు వెతుక్కోండని చెప్పడంతో అక్కడి వారు నిజమేనని నమ్మి ఆ దారిలోకి అడుగుపెట్టలేదు. కానీ ఆ మార్గంలో ట్రాఫిక్‌ కాదు కదా కనీసం వేళ్ల మీద లెక్కేపెట్టేంత వాహనాలు కూడా లేకపోవడం గమనార్హం.

బెర్లిన్‌కు చెందిన సిమన్‌ వెకర్ట్‌ అనే వ్యక్తి 99 సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లను ఓ చిన్నపాటి ట్రాలీలో వేసుకుని ఎంచక్కా రోడ్లపై నెమ్మదిగా నడక సాగించాడు. ఇది గూగుల్‌ మ్యాప్‌కు మరోలా అర్థమైంది. ఆ రోడ్డులో ఎన్నో వాహనాలు ఉన్నాయని, అవి నెమ్మదిగా కదులుతున్నాయని దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయిందని భావించింది. వెంటనే తక్షణ కర్తవ్యంలా.. చాలా మంది యూజర్లకు ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంది, వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.. కనుక మీరు మరో మార్గాన్ని ఎంచుకోండని సూచించింది. ఇక ఆ వ్యక్తి నెమ్మదిగా ఫోన్లను లాక్కుంటూ వెళ్లడంతో ఆ రహదారి ప్రాంతం గూగుల్‌ మ్యాప్‌లో గ్రీన్‌ నుంచి రెడ్‌ కలర్‌కు మారిపోయింది. ఈ ప్రయోగాన్నిఅతను గూగుల్‌ కంపెనీకి దగ్గరలోనే చేపట్టడం గమనార్హం.

గూగుల్‌ నిజంగానే మోసపోయిందా?
ఇక దీన్నంతటిని సిమన్‌ వెకర్ట్‌ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. కానీ దీనిగురించి పూర్తి వివరాలు తెలియపర్చలేదు. దీంతో ఆ వీడియో చూసినవారికి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అంతపెద్ద గూగుల్‌ కంపెనీ ఇంత చిన్నదానికే మోసపోయిందా? అసలు ఇది నిజమేనా, అంతా బూటకమేనా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు గూగుల్‌ మ్యాప్‌పై బాహాటంగానే సెటైర్లు వేస్తున్నారు. కానీ ఇదే కనక నిజమైతే గూగుల్‌ వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఉపక్రమించక తప్పదు. చదవండి: రియల్‌ రైడ్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement