ఇస్లామాబాద్: ‘‘అంతా బాగానే ఉంటుందని ఆశించడం మంచిదే. అయితే అదే సమయంలో విపత్కర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్లయితే పాకిస్తాన్ నెమ్మదిగా విపత్తులోకి జారుకుంటుంది. రాబోయే పరిణామాలు తలచుకుంటే భయంగా ఉంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేయవచ్చు. కానీ ప్రాణాలు పోతే మళ్లీ తీసుకురాలేం’’అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్, ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడిగా కరోనాపై పోరాడుదామని ముందుకు వచ్చినా సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వేళ వివిధ దేశాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పీపీపీ అధికారంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ సహా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న పలు రాష్ట్రాలు స్వచ్ఛంధంగా విద్యా సంస్థలు, కంపెనీలు మూసివేసి పాక్షిక లాక్‌డౌన్ విధించాయి. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిబంధనలు సడలించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.(లాక్‌డౌన్: మృత్యువాత పడుతున్న మూగజీవాలు)
ఈ నేపథ్యంలో కరాచీలోని తన కార్యాలయం నుంచి బిలావల్ భుట్టో వీడియో కాల్ ద్వారా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ సమాజాన్ని కరోనా బెంబేలెత్తిస్తోందని.. ఈ విషయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత వైద్య నిపుణులదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. సరిగా స్పందించకపోతే పరిస్థితి అమెరికా, పశ్చిమ యూరప్ కంటే అధ్వాన్నంగా తయావుతుందని హెచ్చరించారు. వైద్య సిబ్బందికి సరిపడా రక్షణ పరికరాలు లేవని.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా అందుబాటులో లేవని తెలిపారు. కాగా పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 5230 మంది కరోనా కేసులు నమోదు కాగా... 93 మంది మరణించారు.(మూర్ఖులుగా చరిత్రలో నిలిచిపోకండి: ఇమ్రాన్)
Comments
Please login to add a commentAdd a comment