గోరింటాకు పెట్టుకుంటే.. చేతులు కాలాయి!
చేతులకు గోరింటాకు అందమని బ్లాక్ హెన్నా పెట్టించుకుంటే.. ఆ యువతి చేతులు తీవ్రంగా కాలిపోయాయి. దాంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటన షార్జాలో జరిగింది. యూనివర్సిటీలో జరుగుతున్న ఓ కార్యక్రమం సందర్భంగా హెన్నా పెట్టుకుందామని ఆ యువతి ప్రయత్నించింది. డిజైన్ పెట్టుకున్న అరగంటలోనే ఆమె చేతుల మీద విపరీతంగా బొబ్బలు వచ్చాయి. దాంతో వెంటనే ఆమె చేతులు కడుక్కుంది. అయినా మంట తగ్గకపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు వెంటనే చేతులకు హైడ్రోకార్టిజోన్ ఆయింట్‌మెంట్ రాసి, టాబ్లెట్లు ఇచ్చారు. తాను రెడ్ హెన్నా పెడుతున్నానని హెన్నా ఆర్టిస్ట్ చెప్పిందని, కానీ అది డార్క్‌గా ఉండటంతో తనకు అనుమానం వచ్చిందని బాధిత విద్యార్థిని చెప్పింది. బ్లాక్ హెన్నా వాడటం ప్రమాదకరమని తనకు తెలుసని ఆమె చెబుతోంది.
అయితే ఆస్పత్రికి వెళ్లిన వారం రోజుల తర్వాత ఎలర్జీ మరింత తీవ్రతరం కావడంతో ఆమెను అక్కడే ఎమర్జెన్సీకి తరలించారు. ప్రతిరోజూ తనకు టాబ్లెట్లతో పాటు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారని, ఈ నొప్పి భరించలేకపోతున్నానని వాపోయింది. బాధితురాలికి హైబీపీ కూడా ఉండటంతో ఆమెకు గుండె నొప్పి రావడం మొదలైంది. దాంతో చికిత్స మొత్తం మార్చాల్సి వచ్చింది. చేతుల మీద వాపు తగ్గడానికి ప్రతి రెండు గంటలకోసారి ఐస్ ప్యాక్ పెడుతున్నారు. బొబ్బల కారణంగా ఇప్పటికీ వేళ్లు మడవలేకపోతున్నానని, రాత్రిపూట కూడా మంటలు, దురద ఎక్కువ కావడంతో నిద్ర పట్టడం లేదని ఆమె తెలిపింది. యూనివర్సిటీ వర్గాలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాయి.