
నెత్తురోడిన లాహోర్
ఆత్మాహుతి బాంబు దాడితో పాకిస్తాన్ లోని లాహోర్ సోమవారం రక్తమోడింది.
► ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతి.. 71 మందికి గాయాలు
► మృతుల్లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు
లాహోర్: ఆత్మాహుతి బాంబు దాడితో పాకిస్తాన్ లోని లాహోర్ సోమవారం రక్తమోడింది. నగరంలోని పంజాబ్ అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 13 మంది మరణించగా... దాదాపు 71 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో దాదాపు 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి సల్మాన్ రఫీక్ తెలిపారు. మృతుల్లో లాహోర్ ట్రాఫిక్ పోలీసు చీఫ్ అహ్మద్ మొబీన్ , సీనియర్ ఎస్పీ జహీద్ కూడా ఉన్నారని లాహోర్ పోలీసు కమిషనర్ అమిన్ వైన్స్ చెప్పారు.
లాహోర్ పోలీసులే లక్ష్యంగా దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు వెల్లడించారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఫార్మాస్యూటికల్స్ తయారీదారుల ఆందోళన నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆందోళనకారులతో చర్చించేందుకు ట్రాఫిక్ పోలీసు చీఫ్ మొబీన్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మోటారుసైకిల్‌పై వచ్చిన దుండగుడు తన వాహనాన్ని పోలీసు అధికారుల సమీపంలోకి తీసుకెళ్లి పేల్చేసుకున్నాడు.
ముందే హెచ్చరించినా అడ్డుకోలేకపోయాం
పంజాబ్ అసెంబ్లీ భవనం, గవర్నర్ నివాసాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయని, భద్రతను కూడా పటిష్టం చేశామని పంజాబ్ న్యాయ శాఖ మంత్రి రానా సనుల్లాహ్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించకుండా అడ్డుకుని ఉంటే పేలుడు జరిగి ఉండేదికాదని ఆయన పేర్కొన్నారు.