
నరకానికి నకళ్లు ఈ జైళ్లు
బ్రెజిల్‌లోని పెర్నాంబుకో రాష్ర్టంలోని జైళ్లు నరకానికి నకళ్లు. వాటిలో రెండు జాతుల నరులు ఉన్నారు. పెత్తనం చెలాయిస్తూ శాసించే వాళ్లది ఒక జాతికాగా, వారి అమానుషత్వానికి, అఘాయిత్యాలకు బలైపోయే బానిసలు రెండో జాతి.
బ్రెజీలియా: బ్రెజిల్‌లోని పెర్నాంబుకో రాష్ర్టంలోని జైళ్లు నరకానికి నకళ్లు. వాటిలో రెండు జాతుల నరులు ఉన్నారు. పెత్తనం చెలాయిస్తూ శాసించే వాళ్లది ఒక జాతికాగా, వారి అమానుషత్వానికి, అఘాయిత్యాలకు బలైపోయే బానిసలు రెండో జాతి. పెత్తనం చెలాయించే వారికి విశాలమైన గదులు, ప్రత్యేక మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, కాలక్షేపానికి కలర్ టీవీలు, సెల్‌ఫోన్లు, పనివారలుగా అన్ని పనులు చేసిపెట్టే తోటీ బానిస ఖైదీలు, మత్తిచ్చే కొకైన్లు. మత్తులో మృగాళ్లుగా మారినప్పుడు పైశాచిక సుఖాన్నిచ్చే బానిస ఖైదీలు.
మరుగు దొడ్లు కూడాలేని ఇరకు గదుల్లో యమలోకపు హింసలను జైల్లోనే అనుభవించే బానిస ఖైదీల గురించి పట్టించుకునే నాధులే లేరు. పెత్తనం చెలాయించే ఖైదీల పైశాచికత్వానికి రక్తం కక్కుకొని చస్తున్నారు. ఒక్కరిపై పది మంది వరుసగా రేప్‌లు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుందామంటే వారికి ఆసరా ఇచ్చే వారు కూడా ఆ జైళ్లలో ఎవరూ లేరు. తాత్కాలికంగానైనా ప్రత్యక్ష నరకాన్ని మరచిపోయేందుకు బలవంతంగా కొకైన్‌కు బానిసలవుతున్నారు. వారికి కొకైన్ సరఫరా చేసేవారు కూడా పెత్తనం చెలాయించే ఖైదీలే. వీరిని ‘కీ హోల్డర్లు’ అని పిలుస్తారు. ఒక్కసారి కొకైన్ సరఫరా చేసినందుకు 80 రూపాయల నుంచి 800 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇందుకు అప్పులిచ్చి వారానికి ఇంతంటూ వడ్డీలు కూడా వసూలు చేస్తారు.
ఇలాంటి నరక కూపంలో బతుకుతున్న బానిస ఖైదీలకు డబ్బులొచ్చే మార్గాలు కూడా ఉండవుగనుక వారి కుటుంబ సభ్యుల నుంచి పెత్తనం చెలాయించే ఖైదీలే వసూలు చేస్తారు. జైలుకు రక్షణగా ఉండే పోలీసులే అందుకు పావులుగా ఉపయోగపడతారు. వినిపించుకోని కుటుంబ సభ్యులను బయటి అరాచక శక్తులనుపయోగించి కీ హోల్డర్లు చంపిస్తారు. అందుకు సెల్‌ఫోన్లను కూడా యధేశ్చగా ఉపయోగిస్తారు. పెర్నాంబుకో రాష్ట్రంలోని నాలుగు జైళ్ల పరిస్థితిపై ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ అనే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఇటీవల అధ్యయనం జరిపి నివేదికను వెల్లడించింది. వాటిలో కురాడో జైల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపింది. ఖైదీలను, వారి బంధు మిత్రులను, జైలు అధికారులను ఇంటర్వూలు చేసి ఈ ఘాతుకాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
జైల్లో తన కొడుకు కొకైన్ కోసం చేసిన అప్పు దాదాపు 40వేల రూపాయలను తాను చెల్లించానని సాండ్రా అనే తల్లి వెల్లడించింది. అందుకోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేశానని తెలిపింది. జైల్లో తన మేనళ్లుడిని తీవ్రంగా తోటి ఖైదీలే హింసించారని మారియా అనే ఓ మహిళ వెల్లడించింది. జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పింది. 64 మంది ఖైదీలం ఉంటున్న ఓ గదిలో తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని 34 ఏళ్ల పావులో తెలిపారు. వారు కనీసం కండోమ్స్ కూడా ఉపయోగించరని, ప్రతిఘటిస్తే హింసిస్తారని వాపోయాడు.
బ్రెజిల్‌లో ప్రతి లక్షమందిలో 870 మందికి ఎయిడ్స్ ఉంటే కురాడో జైల్లో 40 రెట్లు ఎక్కువ ఎయిడ్స్ రోగులు ఉన్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. పెర్నాంబుకో జైళ్లలో 3,77,000 మందికి వసతి ఉండగా, 6,07,000 మంది ఖైదీలు ఉంటున్నారని పేర్కొంది. జైళ్లు కిక్కిర్సి ఉండడం వల్లనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని జైలు అధికారులు తెలియజేశారు. వాస్తవానికి కీ హోల్డర్లకు సకల సౌకర్యాలను కల్పిస్తోందని, విధులను నిర్లక్ష్యం చేస్తోందీ ఈ మూడవ జాతే. కొంత మంది జైలు అధికారులు డబ్బులకు ఆశపడి, మరికొంతమంది ప్రాణభీతితో దారుణాలను ప్రోత్సహిస్తున్నారు.