హాంకాంగ్: ఆసియాలో ఆగ్రరాజ్యంగా వ్యవహరిస్తున్న చైనాలో 70వ అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. హాంకాంగ్‌లో రక్తం ఏరులైపారింది. గత నాలగు నెలల నుంచి కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలపై మంగళవారం సైనిక దళాలు ఉక్కుపాదం మోపాయి. హాంకాంగ్ వీదుల్లో నిరసన తెలుపుతున్న గుంపుపై అక్కడి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అంతకీ తగ్గకపోవడంతో తుపాకీ తూటాలకు పనిచెప్పారు. ఈ క్రమంలో ఓ ఆందోళకారుడి గుండెల్లోకి తుపాకీ తూటా దూసుకుపోయింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి యూనివర్సిటీ విద్యార్థి చోంగ్ వెల్లడించాడు.
ఇదిలావుండగా ఆదివారం ఉదయం వేలాది మందితో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు సబ్‌వే రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు బారికేడ్లకు నిప్పు పెట్టారు. చైనా అవతరణ దినోత్సవం పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసరగా పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్‌ను, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనన్లను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్‌తోపాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని 40 ప్రాంతాల్లో సాయంత్రం సంఘీభావ ర్యాలీలు జరిగాయి.
నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని ప్రతిపాదిస్తూ హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టిన విషయంతెలిసిందే. ఈ బిల్లుపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో, హాంగ్‌కాంగ్ చీఫ్ కారీ లామ్ ఈ బిల్లు అంశాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని, లామ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చైనా ప్రభుత్వం లామ్‌కు మద్దతుగా నిలిచింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించొద్దని సూచించింది. దీంతో, హాంగ్‌కాంగ్ పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అరెస్ట్ చేశారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య హాంగ్‌కాంగ్ వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు సాధారణమయ్యాయి. హాంగ్‌కాంగ్‌లో అశాంతియుత వాతావరణం సృష్టించేందుకు పలు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, హాంగ్‌కాంగ్‌ను చైనా నుంచి విడదీయడానికే ఈ నిరసనలని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. చైనా ఏకపక్ష విధానాలు రుద్దుతోందంటూ మెజార్టీ హాంగ్‌కాంగ్ ప్రజలు నిరసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment