
అమ్మకు బరువై.. బతికుండగానే పూడ్చేసింది
అమానుషం, దారుణం, క్రూరత్వం లాంటి పదాలు చాలని ఘటన. పేగు తెంచుకుని పట్టుమని పది నిమిషాలైన గడవక ముందే బిడ్డను అనంతలోకాలకు పంపేయాలకున్న తల్లిదండ్రులు పాత సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. పూడిపోయిన సెప్టిక్‌ట్యాంక్‌ను కొంతమేర తవ్వి బిడ్డను అందులో పడేసి.. బయటకు కనిపించకుండా.. కుళ్లిపోయిన చెత్త, ఆకులు, రాళ్లు వేశారు.
దీంతో బిడ్డ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. దుర్గంధంతో నిండిన ఆ గుంతలో ప్రాణాలను ఆ దేవుడే నిలబెట్టాడని చెప్పుకోవాలి. బిడ్డ ఏడుపు విన్న చుట్టుపక్కల వారు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక తొలుత అయోమయంలో పడ్డారు. ఆఖరుకు సెప్టిక్‌ట్యాంక్ లోపల నుంచి ఏడుపు వస్తున్నట్లు గుర్తించి ఆకులు, రాళ్లను తొలగించి బిడ్డను రక్షించారు.
పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని తల్లిద్రండుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.