
మీ పిల్లలకు ఈ స్నాక్స్ ఇస్తున్నారా!
న్యూయార్క్: సాయంత్రమైతే చాలు పిల్లలు ఇంట్లో ఏదో ఒక స్నాక్ తినాల్సిందే. దీని వల్ల వారు అధికంగా బరువు పెరిగిపోయే ప్రమాదముంది. ఇది ఒబెసిటీకి దారి తీయచ్చు కూడా. పిల్లలు ఇలా సాయంత్రం ఆకలేసి అధికంగా తినకుండా ఉండాలన్నా, ఊబకాయం బారిన పడకుండా ఉండాలన్నా మధ్యాహ్నం పూట ప్రోటీన్ స్నాక్స్ అందించండి చాలు. ముఖ్యంగా సోయా ఫుడ్స్‌ని మధ్యాహ్నం తర్వాత స్నాక్స్‌గా అందిస్తే సాయంత్రం పూట తినే అవసరం ఉండదని, దీని ద్వారా పిల్లల్లో ఊబకాయం రాకుండా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. సోయా ప్రోటీన్ ఆహారాన్ని స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల పిల్లలకు కడుపు నిండా తిన్న భావన కలుగుతుందని, దాని ద్వారా వారు సాయంత్రం ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా పిల్లలు పెద్దవారిలాగా మధ్యాహ్నం పూర్తిస్థాయి భోజనాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.
ఈ సమయంలో సులువుగా లభించే స్నాక్స్ ఎక్కువగా తింటుంటారు. ఫలితంగా శరీరంలో అధిక స్థాయి కొవ్వులు, చక్కెరలు చేరుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఇలా పిల్లలు బరువు పెరగకుండా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉండాలంటే మధ్యాహ్నం ప్రోటీన్ స్నాక్స్‌ను అందించాలని పరిశోధకులు సూచించారు. మధ్యాహ్నం పూట తీసుకునే స్నాక్స్ టీనేజ్‌లోని బాలబాలికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మధ్యాహ్నం ప్రోటీన్ స్నాక్స్ తీసుకున్న వారు తర్వాత తక్కువ కొవ్వు పదార్థాల్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదని, ఇలాంటి పిల్లల మానసిక స్థితి కూడా బావుందని అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ పరిశోధకులు వెల్లడించిన ఈ నివేదిక వివరాలు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమయ్యాయి.